#


Index

  అలాంటప్పుడందులో ఒకరి నెక్కదీసి మరొకరిని కుంగదీయవలసిన అవసరం తనకేమిటి. వారిద్దరూ అన్నదమ్ములు. పోట్లాడుకొన్నా పొందికగా ఉన్నా వారిలో వారు చూచుకొంటారు. తనకు దేనికి. తమ అన్నదమ్ముల వ్యవహారంలో మరెవరయినా కలగజేసుకొన్నారా. తాను దేనికితరుల వ్యవహారంలో జోక్యం చేసుకోటం. ఒకవేళ తనకార్యం సాధింటం కోసం చేసుకొన్నాడేమో. అందుకైనా బలవంతుడు వాలినే పట్టుకోవాలి గాని దుర్బలుడైన సుగ్రీవుణ్ణి పట్టుకొని ఏమిలాభం. కాబట్టి రాజనీతి కూడా కాదిది. అంతే కాదు. ఒక వీరుణ్ణి అంతమొందించాలనే ఆశయంతో ప్రవర్తించాడే అనుకోండి. అప్పటికీ వీరోచితంగా పోరాడి వాణ్ణి సంహ రించవచ్చు గదా. చెట్టుచాటునుంచి బాణం వేసి చంపవలసిన కర్మ ఏమి పట్టింది. ఇది ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రఘుదిలీపాది రాజన్యులను తాతముత్తాతలుగా పేర్కొనే మహా వీరునికి తగిన చర్యయేనా. దీనివల్ల భీరుడనిపించు కొంటాడే గాని తాను వీరుడెలా అవుతాడు. ఇదుగో ఇలాంటి ప్రశ్న పరంపర లెన్నో శరపరంపరలాగా ఎదురవుతాయి ఈ సందర్భంలో. హేతువాదు లిప్పుడీ ఆక్షేపణలు చేస్తున్నారంటే మనం తప్పు పట్టనక్కరలేదు. ఎందుకంటే అసలీ హేతువాదులేమిటి. వాల్మీకి మహర్షికే తోచాయి ఆ శంకలన్నీ. తన మనసుకు తోచిన ఆ శంకలన్నిటినీ వాలి ముఖంగా తానే అనిపిస్తాడు రాముడి దగ్గర. కథం దశరధేనత్వం జాతః పాపోమహాత్మనా- పెద్దమనిషి అనిపించుకొన్న దశరథుడికింత నీచవర్తనుడివి నీవెలా జన్మించావు. నత్వాం వినిహతాచారం- ధర్మధ్వజ మధార్మికం జానేపాప సమాచారం-తృణచ్ఛన్నకూపాని వని తెలియక మోసపోయాను. అందుకే తార వద్దంటున్నా రాముడంటే కరుణాళుడు. ప్రజాహితకారి - సమయజ్ఞుడు దృఢవ్రతుడు - అని లోకంలో నలుగురూ నిన్నిలా ప్రశంసిస్తుంటే విని అలాంటివాడు నా కెందుకు కీడు చేయబోతాడు లెమ్మని బరవసాతో వచ్చి

Page 80