#


Index

  త్వద్విధానా మసదృశం, ఈ దృశం విద్దిలాఘవమ్– మీలాంటి వారికి ఇలాంటి బేల తనం తగిన లక్షణం కాదు. మయాపి వ్యసనం ప్రాప్తం - భార్యాహరణజం మహత్ నాకూ భార్యా వియోగదుః ఖం ప్రాప్తించింది, నచాహమేవం శోచామి నచధైర్యం పరిత్యజే- కాని నేనెప్పుడూ ఇలా ఏడుస్తూ కూచోలేదు. నీలాగా ధైర్యం కోలుపోలేదు. ఇదంతా చూస్తే లక్ష్మణ సుగ్రీవులకున్న స్తిమితత కూడా రాముడికి లేదే. అలాంటి కామపరూడూ - వ్యసనపరుడూ - దుర్బలుడూ దేవుడెలా అయ్యాడు -ఆదర్శ పురుషుడెలా అయ్యాడని ఇప్పుడు ప్రశ్న.

  కనుకనే ఆయన దేవుడయ్యాడని మా జవాబు. ఇదేమిటి చాలా విడ్డూరంగా ఉందే అనిపించవచ్చు. విడ్డూరంగానే ఉంటుంది మరి. దేవుడు గనుకనే ఆయన వ్యవహార మెప్పుడూ విడ్డూరమే జీవుడి దృష్టికి. మనకు విడ్డూరమైతే ఆయనకది వినోదం. ఆ వినోదాన్ని విడ్డూరాన్ని వర్ణించి చూపడమే వాల్మీకి రచనలోని విశేషం. నిష్కాముడూ నిరంజనుడూ అయిన భగవానుడు లోకంలో అవతరించి సకాముడుగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో చూపదలచాడు మనకు వాల్మీకి. అది నటన అని తెలియక నిజమేనని భ్రమపడే తోడి జీవుల వ్యవహారమెలా ఉంటుందో కూడా చూపదలచాడు. కనుకనే రాముడు సీతా వియోగం తట్టుకోలేక ఉన్మత్తుడి లాగా ప్రవర్తించటం అది చూచి తట్టుకోలేక సుగ్రీవాదు లాయనను ఓదార్చటం - రెండూ అసత్యాలే. లోకసత్యాన్ని ధ్వనింపజేసే కావ్య సంకేతాలు. లోకంలో ఒక కాముకుడైన మానవుడు ప్రాణాధికంగా తాను ప్రేమించే ప్రియురాలు తనకు దూరమయినప్పుడెలా బాధపడుతాడు. ఎలా స్పందిస్తాడు. ఎంతగా ఆక్రందిస్తాడు. ఈ ప్రేమ రహస్యం మనకు తెలపాలి. తెలపాలంటే తనకది సహజంగా లేకున్నా ఉన్నట్టు చూపాలి. ఇది పరమాత్మ మానవ స్వభావాన్ని-మనస్తత్త్వాన్ని- అనుకరించి లోకానికి ప్రదర్శించే తీరు.

Page 77