#


Index

  ఆద్యంతాలలో లేనిది మధ్యంలో మాత్రమెలా ఉండగలదు. ఉన్నట్లు భాసిస్తున్నా అది అసత్కల్పమే. కాబట్టి దాన్ని కేవలం కాదనటానికి కూడా వీలులేదు, ఇదీ పరిష్కారం.

  పోతే 'నశూన్యమ్ నచాశూన్యమ్' అది శూన్యమూకాదు. శూన్యమంటే అభావం. లేనిదని అర్థం. చైతన్యానికేగుణాలూ లేవని నిషేధించటంవల్ల అసలే లేదనటాని కాస్కారముంది. ఎందుకంటే పదార్థమన్నప్పుడు దానికేదో ఒక గుణముండి తీరాలి. గుణరహితమైన పదార్ధమంటూ ఎక్కడా ఉండబోదు. ఆత్మచైతన్యమలాంటి నిర్గుణమైన తత్త్వంగా వర్ణిస్తున్నారు. అలాంటప్పుడది శూన్యం కావలసిందేగదా అని ప్రశ్నవస్తుంది. దీనికి జవాబే 'న శూన్యం' నిర్గుణమైనా అది శూన్యంకాదట. ఎంచేత ? శూన్యమని చెప్పవలసిన వారెవరు మరలా ఆ చైతన్యమేకదా. తాను శూన్యమని తానే చెప్పగలిగిందంటే అది శూన్యమెలా అవుతుంది. కాబట్టి న శూన్యం. అది శూన్యం కాదు. అంతేకాక 'నచాశూన్యం' అశూన్యం కూడా కాదది. అంటే శూన్యమేనని అర్థం. శూన్యం కాదంటూ మరలా శూన్యమనటమేమిటి. అద్వైతత్వాత్తనే హేతువును మరలా ఇక్కడ అనుసంధానం చేయాలి. అద్వైతమంటే రెండవది లేదనిగదా అర్థం చెప్పాము. రెండవ పదార్థమే లేకుంటే అది ఉందని చెప్పటాని కాధారమేమిటి. ప్రమాణం లేకుండా ప్రమేయం సిద్ధించదని గదా చెప్పాము. అద్వైతమన్నప్పుడన్ని ప్రమాణాలూ నిరాకృతమయినాయి. కాబట్టి దాని అస్తిత్వాన్ని నిరూపించటానికి మార్గంలేదు. అంచేత శూన్యమే అది.

  శూన్యమే అయితే అది సత్తని ఎలా వర్ణించగలిగారని మరలా ఆక్షేపం వస్తుంది. దానికి సమాధానంగా ‘సర్వవేదాంత సిద్ధమ్' అని చాటుతున్నారు భగవత్పాదులు. ప్రత్యక్షానుమానాదులైన పౌరుషేయ ప్రమాణాలు చెప్పిన మాట అయితే మీరాక్షేపించవచ్చు. ఇది ప్రత్యక్షాదులు చెప్పిందికాదు. వేదాంత శాస్త్రం చెప్పినమాట. అది అపౌరుషేయమైన ఆగమప్రమాణం. ఆగమమంటే గురుశిష్య పరంపరగా వచ్చిన అనుభవజ్ఞానమే. అంతా ఆత్మేనని చూచే జ్ఞానమది. అంతా ఒకే ఒక ఆత్మ అయినప్పుడది నిరపేక్షమైన తత్త్వమవుతుంది. నిరపేక్షం గనుకనే అందులో సాపేక్షమైన దాని కస్తిత్వంలేదు. సాపేక్షమంటే అవును కాదు అనే ద్వంద్వాలు. ఏకమనేకం. కేవలం అకేవలం, శూన్యం - అశూన్యం ఇవన్నీ అలాంటి ద్వంద్వాలే. కనుకనే సాపేక్షమనే ఈ ద్వంద్వాలలో దేనితోనూ నిరపేక్షమైన ఆ తత్త్వానికి నిర్దేశించడానికి లేదు.

Page 47