అద్వైతమని గదా ఈ సిద్ధాంతానికి పేరు. ద్వైతం కానిదేదో అది అద్వైతం. ద్వైతమంటే రెండు. రెండు కానిదంటే అప్పటికి ఒకటి అని అర్ధం చెప్పుకోవచ్చు. కాని అలా కూడా చెప్పగూడదని నిషేధిస్తున్నారు. దాన్ని ఒకటి అనికూడా నిర్దేశించరాదు. ఎంచేతనంటే అది సంఖ్యేయం కాదు. సంఖ్యేయమంటే లెక్కించటానికి విషయం కావటం. అది దేనికీ అసలు విషయమే కాదు. అవిషయమని నిరూపించాము. అలాంటప్పుడేకమని మాత్రమెలా చెప్పడం ఏకమే కాకుంటే ఇక ద్వయమనే మాట కాస్పదమేముంది ఇంతకూ అది ఏకమూ కాదు. అనేకముకాదు. ఏవిధంగానూ పరిగణించరాదు. దాన్ని.
ఏ పరిగణనా లేకపోతే అది ఇక కేవలమని పేర్కొనవలసి వస్తుంది. పోనీ కేవలమా అంటే అదీకాదని త్రోసివేస్తున్నారు. “న వా కేవలత్వం” కేవలం కాకపోతే పోనీయండి; కేవలం కాదంటే ఇక అకేవలమే గదా అంటే అలాగూ భావించరాదట. నచాకేవలత్వమ్ చూడబోతే ఇది చాలా చిత్రంగా కనిపిస్తున్నది. కేవలం కాదని ఒక మాట కేవలం కాకపోదని మరొకమాట. ఇంతకూ అది కేవలమా కాదా. రెండూ వర్ణించటంవల్ల రెండుభావాలకూ ఆస్కారమున్నట్లు అవగతమవుతుంది. అయితే ఇవి రెండూ పరస్పర విరుద్ధభావాలు. రెండూ ఒకే పదార్థంలో ఎలా ఉండగలవు. "అద్వైతకత్వాత్" అద్వైతం కాబట్టి రెండూ ఉండగలవని సమర్థిస్తున్నా రాచార్యులవారు. అది ఎలాగని అడగవచ్చు.
అద్వైతమంటే రెండవదిలేదని అర్థం. రెండవది అసలే లేకపోతే లేదని నిషేధించవలసిన అగత్యమేమిటి. “ప్రాప్తసతి ప్రతిషేధః" అని శాస్త్రజ్ఞుల సమయం. ఒకటి ప్రాప్తిస్తున్నప్పుడే దాన్ని ప్రతిషేధించాలి మనం. ప్రస్తుతమిక్కడ లేదని ప్రతిషేధిస్తున్నామంటే అప్పటికది ప్రాప్తమయి ఉండాలి. అంటే రెండవ పదార్ధమొకటి ఉండి తీరాలని అర్థం. ఏమిటా పదార్థం. అదే ఈ చరాచర ప్రపంచం. నామ రూపాత్మకంగా విస్తరించి ఉన్న ఈ ప్రపంచమంతా దాని విభూతే. ఇలాంటి విభూతి చేత విశిష్టమై ఉంది కాబట్టి దాన్ని కేవలమనటానికి లేదు. అలాగే ఇది ఎంత విస్తరించి కనిపిస్తున్నా సృష్టికి పూర్వమా చైతన్యంలో అవినాభూతంగానే ఉంది. అలాగే లయానంతరం కూడా దానితో అపృథగ్భూతమే. ఇదమిత్థమని వేరుచేసి చూపే విషయంకాదు. మధ్యకాలంలోనే వేరుగా భాసిస్తున్నది.
Page 46