కాబట్టి శంకర భగవత్పాదులు శూన్యమని ఎప్పుడూ చెప్పలేదు. ఆయన మాయావాదంలోని సూక్ష్మాన్ని గ్రహించలేక గాబరాపడుతున్నారు లోకులంతా. మాయ అన్నా మిథ్య అన్నా ఏదీలేదని గాదు అర్థం. ఏదిగాని చైతన్యనానికి వేరుగా చూస్తే లేదు. చైతన్యంగానే దర్శిస్తే ఉంది. అంటే జగత్తు జగద్రూపంగా లేదు. ఆత్మరూపంగానే ఉంది. దీనినిబట్టి ఆత్మే ఉంది మరేది లేదని చెప్పినట్టయింది. మరేదీలేదు కనుకనే ప్రపంచంలో ఆత్మభిన్నంగా మనకేది కనిపిస్తున్నా అదంతా ఆత్మేనని చూస్తూ పోవాలని సాధన మార్గాన్ని కూడా బయటపెట్టారు భగవత్పాదులు.
శ్లోకం 10
న చైకం తదన్యద్ద్వితీయం కుతః స్యాత్
నవా కేవలత్వం న చా కేవలత్వమ్ ।
న శూన్యం న చా శూన్య మద్వైతకత్వాత్
కథం సర్వవేదాన్త సిద్ధం బ్రవీమి ॥
స్తోత్రంలో ప్రతిపాదించవలసిన విషయమంతా సమాప్తమయింది. పోతే ఇక దాన్ని అనుభవానికి తెచ్చుకోవటమెలాగా అని ప్రశ్న అనుభవమార్గాన్ని కూడా దృష్టాంతమనే నెపంతో ఎక్కడిదక్కడ సూచిస్తూనే వచ్చారు భగవత్పాదులు. కాని, ప్రస్తుత మీ ముగింపు శ్లోకములో అద్వైతానుభవమంటే ఎలాంటిదో అందులో ఉండే వైలక్షణ్యమేమిటో విశేషంగా నిరూపిస్తున్నారు. అద్వైతంలో అనుష్ఠానమనేది వేరే లేదు. సిద్ధాంతాన్ని కరతలామలకంగా అర్థం చేసుకోవటమే అనుష్ఠానం. సిద్దాంతమేమిటి ? ఉన్నదంతా చైతన్యమే అది నా స్వరూపమే. ఇంతకుమించి మరేమీ లేదు. అలా అనుకొన్నప్పు డఖండాకారమైన వృత్తి ఒకటి ఏర్పడుతుంది. ఆ వృత్తి నావృత్తి చేసేకొద్దీ అందులో ఆత్మేతరమైన జగత్తు సర్వమూ విలయమై, ఆత్మ మాత్రమే శేషిస్తుంది. అది విశ్వతోముఖంగా వ్యాపించిన మన స్వరూపమే కాబట్టి ఇక దానిని గురించి వికల్పం చేయటానికి వీలులేదు. కేవల మనుభవాత్మకమే అది. ఒకమాధుర్యాన్ని ఆస్వాదించేటపుడెల్లా మాటలు లేవో దానిని అనుభవించేటపుడు కూడా అలాగే మాటలు లేవు. కనుకనే చెబుతున్నారు స్వామివారు. “నచైకం తదన్యద్ద్వితీయం కుతః స్యాత్” అది ఏకమే కాదే మరి దానికి భిన్నంగా ద్వితీయమనే దెక్కడిది అని.
Page 45