దానికి మారుగా ఆత్మేతరమైన జీవజగత్తులే గోచరమవుతున్నాయి. గోచరిస్తుంటే ఇవి ఎలా గోచరిస్తున్నాయని ప్రశ్న వచ్చింది. దానికి సమాధానమిస్తున్నారు జగద్గురువులు. ఇది అన్యం అనన్యమైన ఆత్మనాశ్రయించి ఇది బ్రతుకుతున్నదని అంతేగాని వాస్తవ మాలోచిస్తే ఆత్మ కన్యంగా అనాత్మ ప్రపంచమంటూ ఒకటి ఏదీలేదు. అందుకే జగత్తనేది శూన్యమని చాటారు.
శూన్యమంటే మరలా అసలే అభావమని మనం పొరబాటు పడరాదు. ప్రపంచ మనేది అభావంకాదు. అత్యంతాభావమైతే అలాంటి వస్తువెప్పుడూ మనకంటికి కనపడదు. ఆకాశపుష్పంగాని, కుందేటి కొమ్ముగానీ మనకగపడుతుందా. కాని ఎండమావులలోని నీళ్లు మాత్రం కనపడుతాయి. కనపడుతాయంటే అవి నిరాశ్రయంగా కనపడటంలేదు. దానికి కూడా ఒక అధిష్ఠానముంది. అదే సూర్యరశ్మి. సూర్యకిరణాలే అలా నీళ్ళలాగా మనకు ప్రతీయమానమవుతున్నాయి. కిరణాలుగా భావిస్తే అవి సత్యం. నీళ్ళుగా చూస్తే అసత్యం. అలాగే ఈ అనాత్మ జగత్తుకూడా వాస్తవంలో అనాత్మకాదు. అదికూడా ఆత్మే. అయితే ఆత్మగా భావించనంతవరకూ ఇలా అనాత్మగా భాసిస్తుంటుంది. ఈ భాసించే రూపం తీసుకొంటే అది అసత్యమే, శూన్యమే. కాని ఈ భాసమట్టుకే గాక దీని తాలుకు భాస అని దానిమూలాన్ని అన్వేషించామంటే అది ఆత్మే కాబట్టి దానిదృష్ట్యా ఇది యథార్థమే అవుతుంది. శూన్యంకాదు. అయితే ఎటువచ్చి అలా అన్వేషణ చేయాలనే షరతొకటి ఉంది. దానినికూడా ధ్వనింపజేశారాచార్యులవారు "తదన్యత్" అనే వాక్య శేషంలో తదన్యచ్చేత్ దానికన్యంగా భావిస్తేనని అర్థం చెప్పుకోవాలి మనమప్పుడు. అన్యంగా భావించినప్పుడే జగత్తు తుచ్చం. లేకుంటే స్వచ్ఛమేనని తాత్పర్యం.
దీనిని బట్టి శంకరులవారి మిథ్య మాయ అనే మాటల కర్ధమేమిటో స్పష్టంగా తెలిసిపోయింది. మిథ్య మాయ అంటే లేదని వ్యాఖ్యానిస్తారు చాలామంది. పామరులే గాదు పండితులే బోల్తాపడ్డారీ విషయంలో. ఆఖరుకు శంకరుడు ప్రచ్ఛన్నబౌద్ధుడని నిందించటానికి కూడా సాహసించారు. ఇది ఎంత అవివేకమో చెప్పలేము. ప్రపంచం లేదన్నది శంకరుడు కాదు. ఆ మాటకు వస్తే అది అన్నవారు బౌద్ధులు. వారామాట అన్నందుకు శతధా ఖండించారు శంకరులావాదాన్ని అలా ఖండించి ఆయనే మరలా శూన్యమని వాదించటమా ? ఎంత అన్యాయం ?
Page 44