#


Index

  అది మరలా పొరబాటు. ప్రకాశమంటే నేను అనే ఒక ప్రజ్ఞమాత్రమేనని అర్ధం చేసుకోవాలి మనం. అలాగే ప్రకాశింపజేస్తున్నదంటే దానికి భిన్నంగా ఏదో ఒక ప్రపంచముందని కాదు. అసలు దానికి భిన్నంగా ఏ ఒక్కటీలేదు. అది మన ఆరోపణే. మనమెంతెంత ఆరోపిస్తామో అంతంత ప్రపంచం దాని చైతన్యచ్ఛాయ నాధారం చేసుకొని భాసిస్తున్నది. ఇది భాసిస్తుంటే అది దీన్ని భాసింపజేస్తున్నదని కర్తృత్వాన్ని దానికారోపిస్తున్నాము. అదికూడా మన అజ్ఞాన విజృంభణమేగాని వాస్తవముకాదు. వాస్తవంలో ఈ రూపాలూ లేవు. అది వీటిని ప్రకాశింపజేయటమూ లేదు. దానిపాటికది ప్రకాశిస్తున్నదంత మాత్రమే. అది కూడా చైతన్యరూపమైన ఒక స్ఫురణమేగాని సూర్యచంద్రాదులలాంటి భౌతిక ప్రకాశం కాదని చెప్పాము. అంచేత ప్రకాశిస్తుందని చెప్పినా అది కేవల చైతన్యమే కాబట్టి అరూపమే.

  అయితే అరూపమయినదాన్ని మనమెలా అనుభవానికి తెచ్చుకోవాలని ప్రశ్న. అసలనుభవమంటేనే అరూపం. రూపాలన్నీ మన అనుభవానికి ఆలంబనాలే. అంతెందుకు; ఒక పంచదారో బెల్లమో నోట్లో వేసుకొని చప్పరించామంటే నాలుకకు తియ్యగా తగులుతుంది. అది జ్ఞాన నాడులద్వారా మెదడుకు చేరుతుందావార్త. దానితో మాధుర్యమనే అనుభవమేర్పడుతుంది మనకు. ఇప్పుడా అనుభవానికి రూపమేమిటని అడిగితే ఏమిటి జవాబు పదార్ధానికే రూపంగాని దాని అనుభవానికి రూపం లేదు. కారణమేమంటే అనుభవమనేది జ్ఞానమే. జ్ఞానానికి రూపం లేదుగదా. అంచేత అనుభవానికీ లేదు. అన్ని అనుభవాలకూ ఆఖరి అనుభవం ఆత్మానుభవం. ఎందుకంటే అది పరిపూర్ణమైన జ్ఞానం. అందులో అన్ని అనుభవాలూ చేరిపోవలసిందే. అంతవరకూ ఇది శుక్ల మది పీత మిది కుబ్జ మది పీనమని చిత్రవిచిత్రమైన అనుభవాలు కలుగుతుంటాయి. ఇలా ఖండఖండంగా కలిగే అనుభవాలన్నీ అఖండమైన ఆత్మానుభవంలో కలిసిపోయి ఒకే ఒక అనుభవంగా మారిపోతుంది. అప్పుడే రూపమూ లేదు. దానికేగుణమూ లేదు. ఏది ఏ మాత్రముందని చెప్పినా అది దానికతిరిక్త (Additional) మవుతుంది. అతిరిక్తమైతే అది అఖండానుభవమే కాదు. అంచేత నిత్య ప్రకాశశీలమై అరూపమైన ఆత్మ చైతన్యమొక్కటే చివరకు మిగిలే అనుభవం.

Page 36