కనుకనే అలాంటి రూపకల్పననంతా నిర్దాక్షిణ్యంగా ఖండిస్తున్నారు ప్రస్తుతం భగవత్పాదులు, "నశుక్లమ్, నకృష్ణమ్, నరక్తమ్, నపీతమ్" ఆత్మ అనేది తెలుపుగాదు, నలుపుగాదు, ఎరుపుగాదు, పసుపుగాదు, దానికెలాంటి రంగులూ, రేఖలూ లేవు. స్పటికం మాదిరి స్వచ్చమైన తత్త్వమది. స్పటికానికైనా ఒక ధావళ్యమంటూ ఉంది. దానికదీలేదు. వర్ణం లేకపోతే పోవచ్చు. పరిమాణమేమైనా ఉందేమో అంటే అది లేదని నిషేధిస్తున్నారు. నకుబ్జమ్, నపీనమ్, అది సన్నముగాదు, లావూగాదు, అలాగని పొడుగుదీ, పొట్టిదీగాదు, 'సహస్రమ్ నదీర్ఘమ్' ఎంచేతనంటే 'అరూపమ్' దానికే రూపమూలేదు.
అయితే ఎక్కడా లేదంటే అంతటా అదే అయినట్టు ఏ రూపమూ లేదంటే అన్ని రూపాలూ మరలా దానివే అవుతాయి. మరి అరూపం అనే మాటకర్ధమేమిటి. రూపాలన్నీ దానివేకాని అది మాత్రం రూపంకాదని అర్థం. ఆభరణాలన్నీ బంగారానికి రూపాలేగాని ఆ రూపాలే బంగారంకాదు. వాటికి వేరుగాకూడా ఉంది బంగారమనేది. ఆభరణాన్ని కరిగిస్తే రూపం పోతుందిగాని బంగారం పోలేదు. అంచేత రూపమనేది ఆగంతుకం దానికి. అది సువర్ణతత్త్వం కాదు. అలాగే ఈ శుక్ల కృష్ణాదులన్నీ ఆత్మరూపాలేగాని ఆత్మతత్త్వంకావు. తత్త్వమనేది దానికి జ్ఞానమే. బంగారానికి పసిమిలాగా అది ఆత్మకు సహజరూపం. ఎప్పటికీ తొలిగిపోదు. పోయేవి మిగతా అగంతుకరూపాలే. అందుకే దాన్ని అరూపమని వర్ణించటం.
అయితే జ్ఞానమనే రూపమొకటి ఉందిగదా అరూపమెలా అయిందని మరలా ఆశంక వస్తుంది. దీనికి సమాధానమే "జ్యోతిరాకారకత్వాత్" అనే హేతువచనం. జ్యోతి అంటే ప్రకాశం. అదే ఆకారంగా కలిగినదేదో అటి జ్యోతిరాకారం. ఈ జ్యోతి సూర్యచంద్రాదులలాంటి భౌతికమైన జ్యోతిగాదు. అభౌతికమైన జ్యోతి. సూర్యచంద్రాది జ్యోతులు చేసే పని ఏమిటి ? అన్ని పదార్ధాలనూ ప్రకాశింపజేస్తాయి. కాని అవి అచేతనం కాబట్టి వాటినికూడా ప్రకాశింపజేసేందుకు మరొక జ్యోతి కావాలి. అదే చైతన్యరూపమైన ఆత్మజ్యోతి. అది తనపాటికి తాను ప్రకాశిస్తూ సూర్యచంద్రాదులతో సహా అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. "తస్య భాసా సర్వమిదం విభాతి" అని చాటుతున్నదుపనిషత్తు.
ఇక్కడ ప్రకాశించటం ప్రకాశింపజేయటమనే సరికొక దీపంలాగా దానికీ ఒక జేస్తుందని భావించవచ్చు.
Page 35