వ్యాపకమైన బంగారంకంటే వ్యాప్త్యమైన ఆభరణాలు వేరుగాలేవు వాస్తవానికి. అలాగే జ్ఞాన స్వరూపమైన మన ఆత్మకన్నా జ్ఞేయమైన ఈ జగత్తుకూడా వేరుగా లేదని గ్రహించాలి. అంటే ఆభరణాలన్నింటినీ బంగారంగా చూచినట్టే అనాత్మ పదార్ధాలన్నిటినీ ఆత్మచైతన్యంగానే దర్శించాలని అర్థం. అయితే బంగారంలాగా దీనికి ఒక రూపమనేది లేదుగదా అని అడగవచ్చు. రూపంలేదనేది ఒక లోపంకాదు. బంగారమంటే జ్ఞేయమైన జగత్తులోనిది కాబట్టి దానికొక విశిష్టమైన రూపముంది. ఇది జ్ఞేయమైన పదార్ధంకాదు. కేవలం జ్ఞానమే అయికూచుంది. అంచేత ఒక విశిష్టమైన రూపమంటూ ఉండటానికిలేదు. లేకున్నా అఖండైక రూపమని వర్ణించారు. కాబట్టి ఒక రూపంగాని రూపముందిదానికి. అది సర్వత్రా వ్యాపించిన మనజ్ఞాన ప్రకాశమే. ఆకాశంలాగా అన్ని వస్తువులనూ వ్యాపించినట్టు మనం దాన్ని భావన చేయాలి. అది మన స్వరూపమే కాబట్టి భావన చేస్తే ఆకాశంలాగానే పరిచినట్లు సర్వత్రా మనకు ప్రత్యక్షమవుతుంది. అంచేత ఫలానా రూపమంటూ ఒకటి లేకపోయినా జాగ్రత్తగా భావన చేసే సాధకుడికది అనుభవానికి రావటంలో ఎలాంటి ప్రతిబంధకం లేదు. సుఖదుఃఖాది భావాలకు రూపం లేకపోయినా అనుభవానికి రావటంలేదా. అలాగే ఇది.
శ్లోకం 6
న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం
న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘమ్ ।
అరూపం తథా జ్యోతి రాకార కత్వాత్
తదేకో వశిష్టః శివః కేవలో 2 హమ్ ॥
అఖండైక రూపమని వర్ణించే సరికదీ ఒక రూపమేమోనని మరలా అపోహ పడవచ్చు. లోకులేకాదు, శాస్త్రజ్ఞులేకాదు, ఎందరో ఇలాంటి అపోహలకు పాలవుతూ వచ్చారు. మొదటినుంచీ ఈ లోకంలో ఎన్నో విగ్రహాలూ, ఆరాధనలూ బయలుదేరా యంటే అదంతా దాని ఫలితమే. మన శాస్త్రాలలో ఎన్నో విద్యలూ ఉపాసనలూ ఏ కరువు పెడుతూ వచ్చారంటే అదంతా దాని ప్రభావమే. ఇంతెందుకు; సగుణమంతా ఇలాంటి భ్రాంతివల్ల ఏర్పడింది. నిర్గుణమైన తత్త్వాన్ని సగుణంగా భావించటం భ్రాంతిగాక మరేమిటి.
Page 34