#


Index

  ఇందులో బాహ్యమనేది ఎక్కడికక్కడే తెగిపోతుంది. ఆభ్యంతరం అలా తెగదు. అది ఆ జాతి పదార్ధాలనన్నింటినీ వ్యాపిస్తూ పోతుంది. అలా వ్యాపించే రూపాన్నే సామాన్యమంటారు వేదాంతులు. వ్యాపించక ఎక్కడికక్కడ విచ్ఛిన్నమయ్యే రూపాన్ని విశేషమంటారు. దీనికి తార్కాణగా బంగారమూ, ఆభరణాలూ తీసుకొని చూడవచ్చు. బంగారానికి బాహ్యరూపమాభరణాలు. అవన్నీ ఎక్కడికక్కడ తెగిపోతాయి. కమ్మలరూపం కాసులదండ దగ్గరలేదు. కాసులదండరూపం ఒడ్డాణం దగ్గరలేదు. కాని బంగారం రూపమన్నింటిలో అవిచ్చిన్నంగా చోటుచేసుకొని ఉంది. కాబట్టి మిగతావన్నీ విశేషమయితే అది సామాన్యం. ఈ సామాన్యానికే అఖండరూపమని పేరు.

  అయితే ఈ అఖండమనేది కూడా మరలా సాపేక్షమే. ఆభరణాలనే ఖండ రూపాల దృష్ట్యా అఖండమేగాని ఆ మాటకు వస్తే బంగారమనేది కూడా అఖండం కాదు. అనేక ధాతువులలో అది ఒకటి. ధాతువనే సామాన్యం అన్నింటి మాదిరే దానినికూడా వ్యాపించి ఉంది. అంచేత ధాతుదృష్ట్యా చూస్తే అదీ ఖండమే. అలాగే ఈ ధాతువు కూడా అఖండంకాదు. అనేక పదార్దాలు జన్మించే ఈ పృథివిలో అది ఒక పదార్ధం. కాబట్టి పదార్థ సామాన్యదృష్ట్యా అదీ ఖండమే. పదార్ధాలన్నీ పృథివీ సామాన్యదృష్ట్యా ఖండమవుతాయి. ఆ పృథివి జలదృష్ట్యా ఖండం. అది తేజోదృష్ట్యా అది వాయుదృష్ట్యా, అది ఆకాశదృష్ట్యా, పోతే ఆకాశం వీటన్నిటికన్నా అఖండ మనుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడికక్కడ ఖండమయిపోతుంటే అది వీటన్నిటినీ అఖండంగా వ్యాపించి ఉంది. కాని చిత్రమేమంటే ఈ ఆకాశంకూడా అఖండంకాదు వాస్తవానికి. ఎందుకంటే దానిని కూడా వ్యాపించి ఉంది ఆత్మచైతన్యం. చైతన్యమనేది లేకపోతే ఆకాశం దగ్గరినుంచి దేనికీ అస్తిత్వమే లేదని చెప్పాము. అంచేత అన్నిటికన్నా అఖండమాత్మే అవుతుంది చివరకు. అయితే అది స్వయంప్రకాశం కాబట్టి ఇక దానికన్నా అఖండమైన పదార్థంలేదు. అందుకే దానినఖండైక రూపమని పేర్కొన్నారాచార్యులవారు. నిజానికి అఖండమైన రూపమది ఒక్కటేనని అర్ధం. కాబట్టి అఖండైక రూపంగానే దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి మనం.

  అది ఎలా సాధ్యమని అడిగితే సువర్ణాభరణ దృష్టాంతాన్ని బట్టే మనం బాగా మననం చేయవలసి ఉంది. సువర్ణం దాని ఆభరణాలలో వ్యాపించినట్టే పిపీలికాది బ్రహ్మపర్యంత మీ ఆత్మ కూడా అన్ని పదార్ధాలలోనూ వ్యాపించి ఉంది.

Page 33