ఎలాగంటే "నచోర్ధ్వం" ఊర్ధ్వంలో లేదది అంటే అధస్సులో ఉందని అర్థం. అలాగే "నచాధః” అధస్సులో లేదు అంటే ఊర్ధ్వంగా ఉందని అర్ధం. రెంటినీ కలిపితే ఊర్ధ్వాధోలోకాలన్నింటిలో ఉందని తెలిసిపోయింది. అలాగే “నచాంతః" లోపలలేదు. అంటే వెలపల ఉందని, "నబాహ్యమ్” వెలపల లేదు. అంటే లోపల ఉందని, వెరసి లోపలా వెలపలా కూడా నిండి ఉందని అర్థం. ఇలా వ్యాఖ్యానిస్తే ఎక్కడా లేనట్టు కనిపించే ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉందని బోధపడుతుంది. అందుకే ముండకోపనిషత్తు "బ్రహ్మపశ్చాత్, బ్రహ్మపురస్తాత్, బ్రహ్మదక్షిణత శ్చోత్తరేణ, అధశ్చోర్ధ్వమ్ ప్రసృతమ్, బ్రహ్మైవేదమ్ విశ్వమిదమ్ వరిష్ఠమ్” అటూ ఇటూ అనే భేదం లేకుండా సర్వత్రా బ్రహ్మమే ఉందని చాటుతున్నది.
అయితే సర్వత్రా అదే ఉన్నప్పుడది మనకు దృగ్గోచరం కావాలి గదా - ఏదీ ఎక్కడా కనపడదే అని అడగవచ్చు. 'వియద్వ్యాపకత్వాత్' అని దానికి హేతువు చెబుతున్నారు భగవత్పాదులు. వియత్తంటే ఆకాశం. ఆకాశంలాగా సర్వతోముఖంగా వ్యాపించి ఉందది. 'ఆసమంతాతా కాశతే ఇతి ఆకాశః'. అంతటా ఉండటంవల్లనే ఆకాశమని పేరువచ్చిందనలు. ఆకాశమిప్పుడంతటా ఉన్నప్పటికీ మనకంటబడటం లేదుగదా. అలాగే అతిసూక్ష్మమైన ఆత్మచైతన్యం కూడా ఆకాశంలాగా అమూర్తం కాబట్టి మన ఇంద్రియాలకు గోచరం కాదు. గోచరం కాకపోయినా ఆకాశముందని ఎలా నమ్ముతున్నామో అలాగే దాన్నికూడ నమ్మవలసి వుంది.
అంతేకాదు. ఆకాశమని కేవలం పోలికకోసం చెప్పటమే గాని అసలాకాశానికీ ఆత్మకూ సంబంధమే లేదు. కారణమేమంటే అది ఆకాశాన్ని కూడా కబళించిన పదార్ధం. వియద్య్వాపకమంటే ఆకాశంలాగా ననేగాక ఆకాశాన్నికూడా వ్యాపించిందని అర్ధం చెప్పవచ్చు. ఆకాశమనేది కూడా పరిచ్ఛిన్నమైన పదార్థమేనని ఇంతకుముందే నిరూపించాము. పరిచ్ఛిన్నమైన ఆకాశానికే రూపంలేదు. ఇక అపరిచ్ఛిన్నమైన ఆత్మ చైతన్యానికది ఎలా సంభవం? కనుకనే దాని జాడా మనకు చిక్కటంలేదు.
అంత చిక్కకపోతే దాన్ని మనమనుభవానికి తెచ్చుకోటం మాత్రమెలా సాధ్యమని మరలా ప్రశ్న వస్తుంది. ఇందుకొక దృష్టాంత గర్భమయిన సమాధానమిచ్చారు. భగవత్పాదులు. అదే అఖండైకరూపం అనే మాట. ప్రతి పదార్థానికీ రెండు రూపాలుంటాయి ప్రపంచంలో. ఒకటి బాహ్యరూపం, మరొకటి ఆభ్యంతరం.
Page 32