#


Index

శ్లోకం 5

న చోర్ధ్వంన చాధో న చాన్తర్న బాహ్యం
న మధ్యం న తిర్యజ్ న పూర్వా పరాదిక్ |
వియద్వ్యాపకత్వా దఖణైకరూప
స్తదేకో వశిష్టః శివః కేవలో 2 హమ్ ||

  ఆత్మ అనేది విశిష్టంగా అనుభవానికి వస్తుందని చెప్పారు. అయితే ఈ ఆత్మ ఎక్కడ ఉందని ? ఎక్కడో ఒకచోట ఉండిగదా మన అనుభవానికి రావలసింది. లోకంలో ఏ పదార్ధంగానీ అలాగే వస్తుందనుభవానికి. ఏదో ఒక ప్రదేశంలో ఉంటేనే మనం దేన్నైనా చూడగలుగుతున్నాము. ఎక్కడాలేని పదార్ధాన్ని ఎవరమూ చూడలేము. ప్రస్తుతమీ ఆత్మ అనేదొకటి ఉంది. అనుభవానికి వస్తుందని చెబుతున్నారు మీరు. ఎక్కడ ఉందది? ఎలా అనుభవానికి వస్తుందని ఇప్పుడు ప్రశ్న.

  అది ఎక్కడా లేదని సమాధానమిస్తున్నారు భాష్యకారులు. “న చోర్ధ్వమ్ న చాధః" అది పైనాలేదు. క్రిందాలేదు. పైన అంటే పరలోకం, క్రింద అంటే ఇహలోకం, ఇహమనేది దృష్టమైతే పరమనేది మనకదృష్టం. రెండూ కాదని నిషేధించటంవల్ల అది ఏలోకంలోనూ లేదని అర్ధమవుతున్నది. అలాగే 'నచాంతర్నబాహ్యమ్' లోపలా లేదది వెలపలా లేదు. కొందరాత్మ అనేది మన శరీరం లోపల ఎక్కడో హృదయ కుహరంలో దాగి ఉన్నదని భావిస్తారు. మరికొందరు బాహ్యంగా ఏ విగ్రహంలోనో ఉంటుందని భ్రాంతి పడుతారు. ఈ మాటతో అవి రెండూ త్రోసి రాజయిపోయాయి. పోతే ఈ రెండింటి మధ్యలో ఉందేమోనని అపోహ పడవచ్చు. అంచేత “నమధ్యమ్” మధ్యం కూడా కాదని త్రోసిపుచ్చారు. అలాగే పైనా క్రిందా లేదంటే అడ్డంగా ఉందనికూడా అనుకోవచ్చు. అంచేత “నతిర్యక్" అలా కూడా లేదని నిషేధించారు. పోనీ ముందుకూ వెనక్కూ పరుగెడితే ఎక్కడైనా దొరుకుతుందా అంటే అదీ కాదన్నారు.

“నపూర్వా పరాదిక్”

  మరెక్కడ ఉన్నట్టది ? ఎక్కడ అనే ప్రశ్నేలేదు. ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉన్నదది. అయితే అంతటా ఉన్నప్పుడెక్కడా లేదనటం దేనికి ? అంతటా ఉంది గనుకనే విశేషించి ఏ ఒక్కచోటా లేదని నిషేధించవలసి వచ్చింది. ఏ ఒక్కచోటనో లేదన్నామంటే అది అన్నిచోట్లా ఉందనే అర్థం. ఈ స్వారస్యమానిషిధించే తీరులోనే మనకర్ధమవుతుంది.

Page 31