మొత్తానికీ దార్శనికులు చెప్పిన ఏ దర్శనంకూడా ఆత్మ తత్వాన్ని దర్శించడానికి పనికిరాదు. కాబట్టి అవన్నీ మనకు నిషిద్ధమే.
అయితే నిషిద్ధమని చెప్పడానికేమిటి సబబని ప్రశ్న. “విశుద్ధాత్మ కత్వాత్” అని జవాబిచ్చారు భగవత్పాదులు. విశుద్ధమంటే బాగా శుద్ధమైనది. అంటే ఏ గుణంతోనూ సంసర్గం లేనిదని అర్ధం. ఇలాంటి నిర్గుణమైనదే ఆత్మతత్త్వమని చెప్పటంవల్ల సాంఖ్యాది సిద్ధాంతాలన్నీ ఒక్కమాటతో చెప్పాలంటే కొట్టుబడిపోతాయి. కారణమేమంటే సాంఖ్యుల ఆత్మకు ప్రాకృత గుణసంబంధం పూర్తిగా వదలలేదు. భాగవతులకు శివవిష్ణ్వాది రూపకల్పన తొలగలేదు. జైనులకు శరీరసాంగత్యం పోలేదు. మీమాంసకులకు కర్తృత్వ భోక్తృత్వాది గుణాలు నశింపలేదు. అంచేత వారు చెప్పిన ఆత్మ విశుద్దం కానంతవరకూ సర్వాత్మభావం సిద్ధించదు. అనాత్మ గంధంకూడా లేని కేవలాత్మభావమే సర్వాత్మభావం. అనాత్మ వాసన అంతో యింతో ఉండనే ఉంది అన్ని దర్శనాల్లో. పోతే అలాంటికథే లేనిదొక్క అద్వైతదర్శనమే. అంచేత అది ఒక్కటే విశుద్ధమైన ఆత్మతత్వాన్ని ప్రతిపాదిస్తుంది.
పోతే ఇది మనకెలా దాఖలా అవుతున్నదని ప్రశ్న, 'విశిష్టానుభూత్యా' అని దానికి దృష్టాంతం చెబుతున్నా రాచార్యులవారు. విశిష్టమైన అనుభవంలోనే మనకది దాఖలా అవుతున్నదట. విశిష్టమైన అనుభవమంటే మిగతావాటికంటే విలక్షణమైన అనుభవం. అంటే ఏ రూపమూ, ఏ గుణమూ, ఏ క్రియాలేని కేవల సచ్చిద్రూపంగా అనుభవానికి రావటం. శాస్త్రోక్తంగా శ్రవణమననాలు చేసిన సాధకుడికి నిదిధ్యాసనా కాలంలో తన స్వరూపం తనకు నిర్గుణంగానే అనుభవానికి వస్తుంది. సందేహం లేదు. నిదిధ్యాసన అంటే విజాతీయ భావాలనన్నిటినీ విడిచి సజాతీయంగా ఆత్మను దర్శించటమేగదా. నామరూపాదులైన గుణాదులన్నీ ఆత్మకు విజాతీయమే. అదే అశుద్ధి. ఇలాంటిఅశుద్ధి సంపర్కం వదిలేస్తూ పోయామంటే అంతకంతకు ఆత్మ శుద్ధం కాక తప్పదు. పూర్తిగా వదిలేస్తే విశుద్ధమే అవుతుందది. 'జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్త్వా' అన్నది ముండకోపనిషత్తు. తత స్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమానః పెద్దలైనవారంతా ధ్యానంలో అలాగే దర్శిస్తూ వచ్చారాత్మతత్త్వాన్ని, కాబట్టి అలా దర్శించటమే విశిష్టమైన అనుభవం.
Page 30