శ్లోకం 4
న సాంఖ్యం న శైవం న తత్ పాఞ్చరాత్రం
న జైనం న మీమాంస కాదేర్మతం వా |
విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వాత్
తదేకో వశిష్టః శివః కేవలో 2 హమ్ ॥
ఇక్కడికి జీవజగత్తులనే రెండు భావాలూ మిథ్యాభూతమేనని తీర్మానమయింది. పోతే ఇక పరిశిష్టమైనదొక ఆత్మ తత్త్వమే. అదొక్కటే సత్యమైన పదార్థం. అయితే సత్యమనేంతవరకూ అందరికీ ఒప్పుదలేగాని అది ఎలాంటి సత్యమనే విషయంలో మరలా ఎన్నో మతభేదాలు వచ్చిపడ్డాయి. అందులో ఒకరు చెప్పిన అభిప్రాయ మొకరొప్పరు. ఏమీ తెలియని లోకులదగ్గరినుంచీ గొప్ప శాస్త్రజ్ఞులనుకొన్న వారివరకూ అందరూ తప్పుదారిలో పడ్డవారే. సాంఖ్యమతాచార్యుడైన కపిలుడాత్మ కేవలుడని గుర్తించినా ప్రతిశరీరమూ అది భిన్నమని వాదిస్తాడు. శైవులూ, వైష్ణవులూ పరమాత్మ ఏకమని భావించినా అందులో మరలా శివుడనీ, విష్ణువనీ ప్రకృతిగుణాలనే తెచ్చిపెడతారు. మరి జైనులైతే పిపీలికాది బ్రహ్మపర్యంతమూ ఆయా శరీరాలనుబట్టి ఎక్కడికక్కడ ఆత్మ పెరుగుతూ తరుగుతూ పోతుందని దానికొక పరిమాణాన్ని కూడా అంటగట్టారు. పోతే ఇక మీమాంసకులని ఒకరున్నారు. వీరు వేదప్రామాణ్యాన్ని ఒప్పుకొన్న నాస్తికులు. శాస్త్రం తప్ప వీరికి మరేదీ పనికిరాదు. శాస్త్రచోదితమైన కర్మలూ, తన్మూలంగా కలిగే ఫలానుభవం, లోకాంతర జన్మాంతరాలూ ఇవన్నీ వీరికి ప్రమాణమే. అందుకోసం శరీరానికి భిన్నంగా ఒక ఆత్మ ఉందని కూడా అంగీకరిస్తారు. అంతవరకూ ఫరవాలేదు. కాని వీరంగీకరించిన ఆ ఆత్మ వేదాంతుల ఆత్మలాగా పరిశుద్ధమైనది కాదు. అహంకార రూపమైన ఆత్మ అది. దానికే కర్రాత్మ అని పేరు పెట్టారు శంకరులు. కర్తృత్వయనే గుణమున్నదేదో అది కర్రాత్మ. అంటే మనః ప్రాణేంద్రియాదులైన ఉపాధులతో ఇంకా వానికి సంబంధం వదలలేదన్నమాట. ఇలాంటి నకిలీ ఆత్మనే పట్టుకొని వారు అసలైన ఆత్మ స్వరూపమని అపోహ పడుతున్నారు.
ఇంతకూ అసలైన ఆత్మతత్త్వమేదో పెద్దలనుకొన్న కపిలకణాదాదులకే అంతుబట్టలేదు. పట్టకనే సాంఖ్య మీమాంసాది మతాలన్నీ లోకంలో ఆవిర్భవించాయి. ప్రస్తుతమివన్నీ కేవలం అపసిద్ధాంతాలని కొట్టివేస్తున్నారు భగవత్పాదులు. 'నసాంఖ్యం నశైవమ్' సాంఖ్యమూకాదు, శైవమూకాదు. 'నతత్పాంచరాత్రమ్' పాంచరాత్రాగమ మని ప్రచారంలో ఉన్న వైష్ణవమూకాదు. అలాగే 'నజైనం నమీమాంసకాదేర్మతంవా' జైన మీమాంసాదర్శనాలు కూడా కాదు. 'ఆదేః' అని ఆది పదాన్ని ప్రయోగించటం వల్ల ఇంకా మిగిలిపోయిన న్యాయవైశేషికాది దర్శనాలను కూడా నిరాకరించి
నట్టవుతున్నది.
Page 29