పోతే ఈ సత్యం మనకెక్కడ తార్కాణమవుతుందని ప్రశ్న. దానికోసమే' సుషుప్తా' అని సుషుప్తి నుదాహరిస్తున్నారు. సుషుప్తి అంటే గాఢనిద్ర. ఆ దశలో ఉపాధులేవీ లేవు. ఉపాధులు లేవనే విషయం మనందరికీ అనుభవ సిద్ధమే. జాగ్రత్స్వప్న దశలలో మనం చూచే ఈ తల్లిదండ్రులు గానీ మనమూహించే లోకాంతరాలుగానీ, లోకపాలురుగానీ ఇవన్నీ ఏవీ మందుకు కూడా కనుపించవు. సుషుప్తిలో ఉపాధులేవీ కనిపించకపోయేసరికి తదువహితుడైన జీవుడుకూడా జీవరూపంగా కనిపించటంలేదు. ఆ జీవరూపం శూన్యమై అతిశూన్యమైన ఆత్మరూపంలో పోయి చేరుతున్నది. ‘సతా సోమ్య తదా సంపన్నో భవతి' సద్రూపమైన ఆత్మలోనే ఏకమవుతాడీ జీవుడని చాటుతున్న దుపనిషత్తు. అదే జీవుడి సహజరూపం. అంతకు ముందున్నది కేవలముపాధి జన్యమే. ఉపాధినాశంతో అది నష్టమయిపోయింది. పోతే ఇప్పుడు సహజమైన రూపంతో ప్రకాశిస్తున్నాడు. అయితే ఇదే సహజమని చెప్పటానికేమిటి నిదర్శనం. అత్యంత సుఖానుభవమేనన్నారు. సుఖమనేది ఆత్మలక్షణం. ఆ సహజమైన సుఖం జాగ్రత్స్వప్నాలలో తిరోభూతమైంది జీవుడికి. అందుకు కారణ ముపాధి సంపర్కం. ప్రస్తుత మా సంపర్కలేశంకూడా లేదు. కాబట్టి మరలా ఆత్మసుఖానుభూతి సుషుప్తిలో అభివ్యక్తమవుతున్నది.
అయితే ఈ సుఖానుభవమనేది అజ్ఞానంలోనే కలుగుతున్నది గాని జ్ఞానంలో కాదు. కనుకనే సుషుప్తిలో నేను ఫలానా అనే స్వరూపానుభవం లేదు జీవుడికి. అంటే సద్రూపుడే కాని చిద్రూపంగా లేడతడు. చిద్రూపులే అయితే ఇక అది సుషుప్తే గాదు. తురీయమయిన సమాధిదశే అవుతుంది. ఆ దశలో అడుగుపెట్టాలంటే నేను అచిద్రూపుడనైన జీవుడనుకాను. సచ్చిద్రూపుడైన పరమాత్మనే అని నిత్యమూ భావన చేయాలి. అలా భావన చేయగలిగితే ఇక జీవుడూ లేడు. జగత్తూలేదు. రెండూ శన్యమే.
Page 28