#


Index

  అదికూడా వట్టి అబద్దమేనని కొట్టివేసినట్టయింది ఈ మాటతో. ఇలా లోకాంతరాలే లేవని ఎప్పుడు నిరాకరించామో, ఇక వాటికోసం చేసే యజ్ఞయాగాది ధర్మకార్యాలకూ, తీర్థ యాత్రాదులైన పుణ్యకర్మలకూ అసలాస్కారమే లేదు. ఇహంలో ఆచరిస్తే పరంలో వీటివల్ల ఉత్తమగతులు కలుగుతాయని ఆశిస్తాడు మానవుడు. యావజ్జీవమూ వాటినేపట్టుకొని ప్రాకులాడుతుంటాడు. పరమేలేదని త్రోసివేసినప్పుడిక వీటికర్థమేముంది? కర్మల కర్దం లేకపోతే వాటిని ప్రతిపాదించే శ్రుతిస్మృత్యాది శాస్త్రాలకంతకన్నా అర్ధంలేదు. అంచేతనే “నవేదా నయజ్ఞా నతీర్థమ్ బ్రువంతి” అంటున్నారు భగవత్పాదులు. వేదాలూలేవు. తదుపదిష్టమైన యజ్ఞాదులూ లేవు. తత్సహకారులైన తీర్థాటనాదులూ లేవు. అంతా మన గొంతెమ్మ కోరికే గాని వేరుగాదు.

  అయితే ఇంత కలాపమూ వట్టిదేనని చాటటానికేమిటి ఉపపత్తి? అసలు జీవుడే అబద్దమయినప్పుడివి ఎలా నిబద్దమవుతాయంటారాచార్యులవారు. జీవుడనే భావమొకటి ఉంటే, వాడికి సంబంధించిన ఈ వ్యవహారమంతా ఒప్పుకోవచ్చు, సందేహంలేదు. కాని అసలు జీవుడనే తత్త్వమే మృగ్యం. జీవుడు మిథ్యాభూతమని చెప్పటానికి హేతువు నిరస్తాతి శూన్యాత్మకత్త్వాత్తని వర్ణించారు. ఈ మాట మనం బాగా అర్ధం చేసుకోవాలి. నిరస్తమంటే త్రోసివేయబడిందని అర్థం. ఏదైనా త్రోసిపుచ్చితే దాని స్థానంలో మిగిలేదిక శూన్యమే. మనః ప్రాణాదులైన ఉపాధులన్నీ శూన్యమైతే జీవుడులేడు. ఉపాధి తంత్రమే జీవభావం. జీవుణ్ణి బట్టి ఉపాధులేర్పడలేదు. ఉపాధులను బట్టే జీవుడేర్పాడ్డాడు. కాబట్టి ఉపాధులు శూన్యం కావటంతో జీవుడు కూడా శూన్యంకాక తప్పదు. శూన్యమంటే మరలా అత్యంతా భావమనికాదు అర్థం. జీవరూపంగా శూన్యమది. జీవరూపంగా శూన్యమయినా తదతీతమైన రూపంగా అది సత్యమే. కనుకనే అతిశూన్యమన్నా రాచార్యులవారు. శూన్యానికతీతమైనదేదో అది అతిశూన్యం. “తమసః పరస్తాత్" అనే మాటకిది ప్రతిధ్వని. అంతా శూన్యమయినా ఆ శూన్యభావానికి సాక్షి ఒకటి ఉందిగదా. అదే అతిశూన్యమనిపించుకొనే ఆత్మ చైతన్యం. ఈ ఆత్మ చైతన్యమే జీవుడి అసలు రూపం. ఆ రూపం మరచిపోతే జీవుడు రంగంలోకి వస్తాడు. దాన్ని జ్ఞాపకం చేసుకొంటే మాయమవుతాడు. తదాత్మకంగానే ఈ జీవుడు సత్యం. స్వతహాగా అయితే అసత్యమే. తదాత్మకంగా అన్నప్పుడిక అంతకు ముందున్న జీవుడూ లేడు. ఉపాధులూ లేవు. అంతా వట్టిదే.

Page 27