#


Index

శ్లోకం 7

న శాస్తాన శాస్త్రం న శిష్యో న శిక్షా
న చ త్వం న చాహం న చాయం ప్రపఞ్చః |
స్వరూపావబోధో వికల్పాసహిష్ణుః
తదేకో వశిష్టః శివః కేవలో హమ్ ॥

  ఆత్మచైతన్యమొక్కటే చివరకు మిగిలేది అది తప్ప మరేదీ లేదని సిద్ధాంతం చేశాము. అలాంటప్పుడిక భేదవార్త అనేది ఏ మాత్రమూ మనకు వినిపించగూడదు గదా, మరి ఒక గురువని, శిష్యుడని, శాస్త్రమని, శిక్షణమని లోకంలో కనిపిస్తున్నదే. భేదమే లేకపోతే ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి. ఇవికూడా లేవంటావా ముముక్షువయిన వాడు సాధన చేసి తరించటానికిక మార్గమే లేకపోతుంది. బ్రహ్మనిష్ఠుడైన ఆచార్యు డొకడుంటే గదా మనం శ్రవణం చేసి తరించవలసింది. భేదమే లేదన్నప్పుడాచార్యుడూ లేడు అతడివల్ల శ్రవణంచేసే శిష్యుడూలేడు. ఇక తరించటమెలాగ ? తరణోపాయం కూడాలేదంటావా - అలాంటప్పుడింత పెద్దశాస్త్రం దేనికి. ఈ ఉపదేశం దేనికి. అన్నింటికీ స్వస్తి చెప్పి ఊరక కూచోటం మంచిది. కాబట్టి భేదాన్ని అంగీకరిస్తే అద్వైత సిద్ధాంతానికే భంజకం. అలాగని అంగీకరించకపోతే గురుశిష్య సంప్రదాయానికే ముప్పు ఇంతకూ దీనికేమిటి పరిష్కారమని ఇప్పుడు ప్రశ్న.

  దీనినికూడ అవలీలగా పరిష్కరించారు భగవత్పాదులు. “న శాస్తా నశాస్త్రమ్” ఆచార్యుడూలేడు, శాస్త్రమూలేదు. “నశిష్యో - నశిక్షా" శిష్యుడూ లేడు, అతడు నేర్వదగిన శిక్షణాలేదు. అంతావట్టిదే, ఎంచేత ? "నచత్వం నచాహం నవాయం ప్రపంచః" అసలు నీవూలేవు. నేనూలేను. మనకు కనిపించే ఈ ప్రపంచమేలేదు. నీవు నేననే తేడావుంటే గురుశిష్య భావమనేది ఉంటుంది. అందుకే ఆస్కారం లేదసలు. ఏమి కారణం? ఉన్నదొకటే ఒక చైతన్యమని గదా ప్రతిపాదించాము. చైతన్యధాతు వొక్కటే అయినప్పుడిక గురుశిష్యభేదమెక్కడిది. భేదం వారి కుపాధులుగా ఉన్న శరీరంలోనే. అవి అసత్కల్పమని ఇంతకుముందే నిరూపించాము. పోతే ఇక ఉన్నదొక్క ఆత్మచైతన్యమే. గురువైనా అదే శిష్యుడయినా అదే. దానికి భిన్నంగా ఈ ప్రపంచమే లేదసలు. ప్రపంచమే లేకపోతే ఇక ఈ శాస్త్రాలెక్కడివి. ఉపదేశాలెక్కడివి. దేనికీ ఆస్కారం లేదు. అంతా అబద్ధమే.

Page 37