#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

  కాళిదాసు కావ్యాలలో ప్రదర్శించిన నవ్యత ఏదో టూకీగా చెప్పుకొన్నాము. ఇక ఆయన తన నాటకాలలో ప్రదర్శించిన దేదో చూడవలసి ఉంది. కావ్యం నవ మన్నప్పు డాయన దృశ్య కావ్యాలను కూడా ఉద్దేశించే గదా నవత్వాన్ని భావించాడని పేర్కొన్నాము. అందులో శ్రవ్యమయింది. ఇప్పుడు దృశ్యమైన నాటక ప్రపంచంలో అడుగు పెడుతున్నాము. నాటకం కావ్యం కన్నా గొప్పదని విమర్శకుల అభిప్రాయం. కావ్యేషు నాటకం రమ్య మన్నారు. నాటకాంతం హి సాహిత్య మన్నారు. సాహిత్య జీవితం నాటక రచనతో సమాప్త మవుతుందట. ఇది అనాలోచితంగా చెప్పిన మాట కాదు. నిజంగా నాటకంతోనే గమ్యం చేరుతుంది సాహిత్య జీవిత యాత్ర. ఎందుకంటే నాటక మనేది మానవ జీవితానికి కేవలమూ ప్రతిరూపం. కావ్యాలతో సహా మిగతా శాఖలన్నీ కేవలం శ్రవ్యాలైతే ఇది ఒక్కటే దృశ్యం. అంటే కంటితో చూచేది. విన్న దాని కన్నా చూచి గ్రహించే దానికి మనసు మీద ఎంతో ప్రభావ ముంటుంది. తన్నిమిత్తంగా కలిగే తృప్తికూడా ఏన్నో రెట్లు హెచ్చుగానే ఉంటుంది. ఇలాటి ప్రత్యక్ష దర్శన మనే గుణం నాటకాని కెంతో విలువ తెచ్చింది.

  పోతే రెండవది దాని శైలి. నాటకంలో శైలి సంవాదాత్మకం. తతిమా రచనలలో మాదిరి ఆఖ్యాన రూపం కాదు. పాత్రలు పరస్పరం సాగించే ఈ సంభాషణ ఎంతో సహజంగానూ సన్నిహితంగానూ కనిపిస్తుంది మన జీవితానికి. ఆఖ్యాన మిలా సన్నిహితంగా రాదు. అది పాత్రల తరఫున కవి చెప్పే మాట గాబట్టి దూర దూరంగానే పోతుంది. మనసు కంతగా పట్టదు. పాత్రలనేవి కావ్యంలో కవి నిర్మించినవి. కవిని చాటు చేసుకొని పరోక్షంగా మెలగవలసినవే గాని ముందుకు వచ్చి మన సమక్షంలో నిలబడవు. నాటక పాత్రలు కూడా కవి కల్పితమే. అయినా అవి మనకు కను మరుగయి పోవు. మీదు మిక్కిలి కండ్ల ముందు ప్రత్యక్షమయి తమ వ్యవహారం తామే అభినయించి చూపుతాయి. అందుకే సంవాదాత్మకంగా నడుస్తూ రసజ్ఞుల నంతగా ఆకట్టు కోవటం.

Page 81

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు