#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

చేయాలనుకొంటే ఎంతైనా చేయవచ్చు వర్ణన. చేయగలడు గూడా. కాని చేయడు కాళిదాసు. అంతకన్నా చేస్తే కథా గమనాని కడ్డమని జాగ్రత్త పడతాడు. మరి ఇలాటి జాగ్రత్త మాఘ భారవ్యాదు లయిన తరువాతి కవులలో కానరాదు. కథ కెంత అవసరమో వారికి తెలియదు. రైవతక మనే పర్వతాన్ని ఒక సర్గ అంతా వర్ణించాడు మాఘ కవి. మధురంగానే ఉండవచ్చు. కాని పనికి రాదు. ఎక్కడ పనికి వస్తుందో కూడా తెలుసు మరలా కాళిదాసుకు. మొదట వర్ణించాడు హిమాలయాన్ని. మరలా వర్ణించాడు మధ్యలో సప్తర్షుల కాయన స్వాగతం చెప్పినప్పుడు వస్తుందా వర్ణన. అక్కడ పరమేశ్వరు నంత వాడికి కన్య నివ్వవలసిన సందర్భం. కనుక ఆయన దేవతాత్మత్వ మెట్టిదో నగాధిపత్య మెట్టిదో వర్ణించ వలసి వచ్చింది. ధాతు తామ్రా ధరః శ్రీమాన్ జంగమం ప్రేష్య భావే వః -స్థావరం చరణాంకితం. అత్యద్భుతమైన వర్ణన ఇది సరిక్రొత్త రూపంలో మరలా నిలిచాడు మన ఎదుట హిమవంతుడు. అతడే మరలా వివాహ సమయంలో సకల దేవతా సభాజన యోగ్యుడైన ఒక సద్గృహస్థుడుగా దర్శన మిస్తాడు. మరి అమ్మవారైతే కన్యగా ఒకమారు శివదీక్షా పరురాలుగా ఒకమారు తపోనిష్ఠలో ఉన్న యోగినిగా ఒకమారు నవ వధువుగా సింగారించుకొని ఒకమారు- చివరకు ప్రియునితో కలిసి భౌమాంతరిక్ష దివ్య సీమలలో విహరిస్తూ ఒకమారు అనేక భంగిమలలో సాక్షాత్కరిస్తుందా జగన్మాత. ఎక్కడ ఏది ఎంత వరకో అంత వరకు వర్ణించటమా మహా శిల్పికి వెన్నతో బెట్టిన విద్య. దీని వల్ల వస్వైక్య దేశైక్య కాలైక్యాలనే త్రిసూత్రి అప్రయత్నంగా సిద్ధించి కావ్యం బాగా చిక్కబడి చక్కగా ఆ మహా కవి ఆసించిన ఫలాన్ని మనకు నిరాఘాటంగా అందించ గలదు. అలాగే అందిస్తున్న దాయన ఈ కావ్య త్రయమూ. అందుకే నేమో వాగా ర్థావివ సంపృక్తా అని రఘువంశాదిలో స్తోత్రం చేయట మా మహా కవి. వాగర్ధాలలో వాక్కాయన కావ్య రచన అయితే అర్ధం దాని వల్ల ధ్వనించే శివ శక్త్యాక్య భావనే. ఈ వాక్కు ద్వారా ఆ పరమార్ధాన్ని అందుకోవటమే ఆయన ఉద్దేశించిన వాగర్థ ప్రతిపత్తి. ఇదే ఆ మహా కవి తన కావ్య త్రయం ద్వారా సాధించిన నవ్యత.

Page 80

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు