రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
చెదర కుండా ఉండటమే లోక స్థితికి రక్ష అని కవి వివక్షితం. దైవ వశాత్తూ శక్తి తనకు దూరమైనా మరలా కలుసుకొనే దాకా పరితాపం తప్పదు. కలుసుకొంటేనే జీవితానికి పరిపూర్ణత. ఈ భావాన్ని కూడా పట్టుకు వచ్చా డక్కడక్కడా కాళిదాసు. అజుడి దగ్గరి నుంచీ రాముడి వరకూ ముడు తరాలు భార్యా వియోగంతో బాధ పడ్డారు ముగ్గురు రాజులు. దానితో తాత్కాలికంగా మతి పోగొట్టు కొన్నారు. పరితపించారు. పరితప్త చిత్తులైన వారి శక్తిని వారికప్పగించే దాకా కాళిదాసుకు నిద్ర పట్టలేదు. అజు డిందుమతిని కోలుపోయి ఆ బాధతోనే మరణించి కూడా మరలా స్వర్గంలో ఆవిడను కలుసుకొని సుఖించాడని వర్ణిస్తాడు. దశరథుడు కౌసల్యాదులకు దూరమై మరలా దివ్యాకృతితో దర్శనమిస్తాడు యుద్ధభూమిలో. పోతే రాముడి సంగతిక చెప్పనే అక్కర లేదు. యోగమూ వియోగమూ రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయాయన జీవితంలో. కడసారిగా భౌతికంగా సీత నెడబాసినా అభౌతికంగా వైకుంఠంలో ఆవిడను వక్షస్థలంలో భద్రంగా చేర్చుకోక తప్పింది కాదు.
ఇలా చూస్తూ పోతే అంతా శివశక్తి విలాసమే ఆయన కావ్య ప్రపంచం. అది నిరూపించటమే ఆయన ధ్యేయం. కుమార సంభవంలో సూటిగా నైతే రఘువంశ మేఘ దూతలలో చాటుగా నిరూపించా డంత మాత్రమే. కథా సన్ని వేశాలూ నాయికా నాయకులూ వర్ణనలూ ఈ కలాపమంతా ఆ భావావిష్కరణ సాధన కలాపమే. ఇదంతా వాగ్రూప మైతే ఈ వాక్రపంచం ద్వారా సహృదయుడు భావించ వలసిన అర్ధమా పరమార్థ రూపమైన శివ శక్తి సమన్వయమే. మరేదీ కాదు. అది భావుకుడి మనసుకు బాగా పట్టాలంటే కథా వస్తు వితిహాస పురాణాలలో లాగా విస్తారంగా ఉండరాదు. సంక్షిప్తంగా ఉంటూ గమ్యాభి ముఖంగా సాగుతూ పోవాలి. ఎక్కడ ఏ విషయం చెప్పినా ఏ పాత్రను సృష్టించినా ఎలాటి వర్ణన చేసినా అది ఆ వివక్షితార్థాని కనుగుణంగానే చేస్తూ పోవాలి. ఒక హిమాలయాన్ని వర్ణించాడంటే పదహారు శ్లోకాలలో సంగ్రహంగా వర్ణించాడు గాని సాగదీయలేదు. వెంటనే కథ అందుకొన్నాడు.
Page 79