#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

అజుడూ దశరథని కామాభిముఖ్యం వల్ల కొంత దెబ్బ తింటే అది మరలా రాముడూ కుశుడి ద్వారా గత వైభవాన్ని అందుకొంటే అది క్రమంగా దుర్బలులైన రాజుల నాశ్రయించి ఎలా పూర్తిగా పతన మవుతుందో చూపి అసుర సంపదను విడిచి దైవ సంపద నలవరుచు కొని బాగు పడండని మనకు చేస్తున్న ఉపదేశమే ఇదంతా.

  ఇందులోనూ ప్రత్యభిజ్ఞా దర్శనమే తొంగి చూస్తున్నది పరోక్షంగా. రాజులు రాజులు కారు. వారీశ్వర స్వరూపులే. నావిష్ణుః పృథివీ పతిః అన్నారు. రాజు విష్ణ్వంశ సంభూతుడట. విష్ణువు స్థితి కర్త. బ్రహ్మ కేవలం సృష్టించాడీ ప్రపంచాన్ని. శివుడు లయం చేస్తాడు. కాని సృష్టికీ లయానికీ నడుమ ఈ జగత్సితిని పాలించ వలసిన వాడు విష్ణువే. మరి రాజనే వాడా విష్ణ్వంశ లేని వాడైతే ఎలా పాలించగలడీ ప్రజానీకాన్ని. నిజంగా విష్ణు స్వరూపుడే. అంతే కాదు. అతనిలో దిక్పాలకుల అంశలన్నీ ఇమిడి ఉన్నాయనే మాటకూడా వాస్తవమే. దశ దిశలూ తిరిగి దేశానికీ ప్రజలకూ ఎలాటి ఉపద్రవమూ రాకుండా చూడవలసిన వాడు గదా. ఇది కూడా గట్టిగా నమ్మిన వాడు కాళిదాసు. కనుకనే నరపతి కుల భూత్యై గర్భ మాధత్త రాజ్జీ గురుభి రభి నివిష్టం లోకపాలాను భావైః అని వర్ణిస్తాడు సుదక్షిణా గర్భస్థుడైన రఘుమహా రాజును. ఋద్ధంహి రాజ్యం పద మైంద్ర మాహుః మహీతల స్పర్శన మాత్రమే తేడాగాని లేకుంటే రాజ్యమనేది ఇంద్రపదమే. రాజనేవా డింద్రుడే నంటాడు. అసలానొక రథ వర్త్ములట రఘువంశ రాజులు. వారందరూ భూతలంలో ఉన్నారని పేరే గాని తరుచూ స్వర్గానికి వెళ్ళి ఇంద్రునికి తోడ్పడుతున్న వారే. ఇలా దేవేంద్రాది దేవతల తోనే గాక వసిష్ఠాది మహర్షులతో కూడా దీటయిన ప్రభావం వారిది. రాజ్యాశ్రమ మునులని వారిని వర్ణిస్తాడు కవి. కనుక ఈశ్వర ప్రతినిధులే ఆ రాజులు కాళిదాసు దృష్టిలో. ఈశ్వరుడు సురేశ్వరుడైతే రాజు నరేశ్వరుడు. ఈశ్వరత్వ మిద్దరికీ అవిశిష్టమే. కనుకనే నేమో కుమార సంభవంలో ఈశ్వరుడి వివాహాన్ని భూలోకంలో ఒక రాజ పుత్రుని వివాహాన్ని తలపించే లాగా వర్ణిస్తూ

Page 77

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు