#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

మయిన ఆ మనో వ్యాధితో ఆయన గంగా సరయూ సంగమంలో దూకి ప్రాణ త్యాగం చేస్తాడు. అంత వ్యామోహంలో కూడా ధర్మం తప్పలేదాయన. ఆత్మ హత్య మహాపాతక మని తెలిసిన వాడు గనుకనే తీర్ధంలో శరీర త్యాగం చేశాడు. తీర్థంలో చేస్తే ఆత్మ హత్య పాతకం కాదని ధర్మ శాస్త్రం. ఇంతకూ పరిశుద్ధమైన దాంపత్య జీవితం ధర్మ బద్దమైన కామోప సేవనం చూపటానికే ఈ రాజు జీవిత మిలా వర్ణించటంలో కవి ప్రయత్నం.

  పోతే దశరథుడి పాత్ర సత్యవాక్పాలనకు నిదర్శనమైతే- ఆ తరువాత వచ్చిన రామ చరిత్ర మంతా సమస్త ధర్మ ప్రబోధానికీ ఆదర్శంగా భావించాడు కాళిదాసు. రామో విగ్రహవాన్ ధర్మః అనే వాల్మీకి సూక్తికి భాష్యం రచించాడా అనిపిస్తుందాయన రామ కథా వర్ణన చూస్తే. శిష్య ధర్మం దగ్గరి నుంచీ రాజ ధర్మం వరకూ ఎవరి పట్ల ఏధర్మ మెలా పాటించాలో రాముణ్ణి చూచి నేర్చుకోవాలి ఏ మానవుడైనా. అందుకే రామావతార మసలు. ఈ అవతార రహస్యాన్ని ఆరు సర్గలలో వ్యక్తం చేశాడు మహా కవి. రాముని తరువాత కుశుని నిష్కామ ధర్మ శీలతను అతి సుందరంగా వర్ణించి వంశంలో పూర్వ పురుషులైన రఘు దిలీపులను మరలా స్మరణకు తెస్తాడు. ఆచక్ష్వ మత్వా వశినాం రఘూణాం - మనః పరస్త్రీ విముఖ ప్రవృత్తి అని కుశు డయోధ్యాధి దేవతను హెచ్చరిస్తుంటే మనలను కూడా ఇలాగే బ్రతకండని హెచ్చరించి నట్టుంటుంది. ఇలాటి హెచ్చరిక నందుకొన్న వారందుకొంటే చివర కందుకోలేక క్రింద బడి పోయా డగ్ని వర్ణుడు. ఇంతకూ నిష్కామ మైన ధర్మ దీక్ష ఎలా అభ్యుదయ హేతువో - సకామమైతే అది ఎలా పతన హేతువో నిరూపించి ధర్మం కామానికి దారి తీయకుండా తదతీత మైన మోక్షానికే చేర్చేట్టు చూచుకోవటమే మన కర్తవ్యమని ఈ రఘువంశ మహా కావ్యం ద్వారా సూచన చేస్తున్నాడు కవి లోకానికి. ఆయా రాజుల చరిత్రలన్నీ అందుకు ఆలంబనంగా తీసుకొన్న సంకేతాలే. అర్థకామాలకన్నా ధర్మం- ధర్మం కన్నా మోక్షం ఉత్తరోత్తరా వాంఛనీయమని చెప్పటమే. దిలీపుడూ రఘువూ ధర్మ దీక్ష -

Page 76

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు