రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ధర్మ దీక్ష అయితే రఘువులో త్యాగ బుద్ధి ఎలా ఉండాలో నిరూపించాడు కవి. విశ్వజిద్యాగం చేసి సమస్తమూ దానం చేశాడు రఘువు. ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. అప్పుడు వచ్చాడు వరతంతు శిష్యుడు కౌత్సుడనే వాడు. సమస్త విద్యా పారంగతుడు. సద్రాహ్మణుడు. అడగలేక అడిగాడు పదునాలుగు వేల బంగారు నాణాలు కావాలి గురు దక్షిణ కని. నాలుగు రోజు లవకాశమివ్వండి అలాగే తెచ్చి ఇస్తానని నిలిపా డాయనను. వసిష్ఠ మంత్రోప దేశంతో కోటిశ్వరుడైన కుబేరుడి మీదికే దండెత్తాలని చూస్తున్నాడు. ఇంతలోనే వచ్చి వినకారు చేశారు కోశ పాలకులు రాత్రి కోశ గృహంలో కనక వర్షం కురిసిందని. వెంటనే ఆ బ్రహ్మచారిని పిలిచి అంతా తీసుకు పొమ్మని చెప్పాడు. నా కెందుకండి ఇంత సొమ్మంటా డాయన. నీకోసం కురిసిందిది నీకే గాని అపరిగ్రహ శీలుడైన నాబోటి క్షత్రియుడి కెందు కంటాడీయన. ఇలాటిదీ రఘుమహా రాజు త్యాగ శీలత. త్యాగాయ సంభృతార్థానా మనేది చాటి చెబుతుం దాయన జీవితం.
పోతే అజుని జీవితం నిర్మలమైన ప్రణయానికి సంకేతం. కర్కశమైన వీర్యమే కాదు సరసమైన హృదయం కూడా ఉండాలి క్షత్రియుడికి. ధర్మ దీక్షే గాదు త్యాగ దీక్షే గాదు ధర్మావిరుద్ధమైన కామం కూడా సేవించ దగిన పురుషార్ధమే నని నిరూపిస్తుం దాయన జీవితం. తండ్రి రఘు వాపాటికే అస్తమించాడు. తనయుడైన దశరథు డెనిమిదేండ్ల కుర్ర వాడు. రాజ్య పాలనా నిష్కంటకంగా సాగుతున్నది. ఎందులోనూ ఏలాటి కొరతా లేదు. ఇక ఏమి కావాలా రాజుకు. సకల కళా ప్రవీణుడూ సంస్కారవంతుడూ ఆయన. అప్సరస లాంటి భార్యతో కలిసి ఉద్యానంలో విహరిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చి పడిందో ఒక దివ్యమైన కుసుమ దామ మామె వక్షస్థలం మీద వచ్చి పడింది. పడట మేమిటి. ఆ సుకుమారి ప్రాణాలు విడవట మేమిటి. రెండూ ఏక కాలంలో జరిగిపోయాయి. ఇక ఆ విరహ వేదన తట్టుకోలేక ఆ రాజు చేసిన విలాప మింతా అంతా కాదు. రతీ విలాపమంత దీర్ఘంగా సాగిందది మరలా. దానికి వసిష్టోప దేశం కూడా పని చేయలేదు. చివరకు రాజ వైద్యులకు దుర్భేద్య
Page 75