#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

విశిష్టత చూపటాని కంత విపులంగా వర్ణించాడు కవి. రఘువుది ఉత్తరమైతే అది అవతారం. ఈశ్వర జ్ఞానంతో తరించిన జీవుడు రఘువు. జీవుడి రూపంలో అవతరించిన ఈశ్వరుడు రాముడు. అల్పజ్ఞుడైన జీవుడీశ్వర ప్రత్యభిజ్ఞతో ఎలా తరించాలో బోధించటానికే రామావతారం. అది అందుకొని సంసారోత్తరణం చేసి పరమాత్మ సాయుజ్యాన్ని పడయట మిలాగా అని చూపటానికే రఘూత్తరం. ఇలా ఈ రెండూ ఒకదానికొకటి గురుశిష్యుల లాగా పూరకమై మనకు తారకం కావాలనే కవి ఈ ఇద్దరి చరిత్రలను ఇంత ప్రశంసా పాత్రంగా తీర్చి దిద్దటం.

  అంతేకాదు. ఎంత గొప్పవంశంలో జన్మించినా- ఎంత విద్యా బుద్ధులు గడించినా దానిని నిలుపుకొన్నప్పుడే దాని కనుగుణంగా ప్రవర్తించినప్పుడే జీవితానికి సాఫల్యం. అలా కాక ప్రాపంచిక మైన వ్యసనాలకు గురి అయితే పైకి పోవట మలా ఉంచి అధః పతనం తప్పదని ఒక గొప్ప హెచ్చరిక కూడా చేస్తున్నాడు కవి ఈ కావ్యం ద్వారా మనకు. దానికి నిదర్శనంగా చిత్రించినదే కావ్యాంతంలో అగ్ని వర్ణుడి జీవితం. అగ్ని వర్ణు డన్ని విద్యలలో ఆరి తేరిన వాడే. కాని అవి అతని కివ్వవలసిన చిత్త సంస్కార మివ్వలేదు. వ్యసనాలకు బానిసను చేశాయి. వల్లకీచ హృదయంగమ స్వనా- వల్గువాగపిచ వామ లోచనా అని వాటి రెంటితోనే జీవిత మంతా గడిపాడు. అది పాతాళానికి గాక పరమ పదాని కెలా దారి చూప గలదు. చివర కలాగే క్షయరోగంతోనే క్షయమై పోయిందా రాజు జీవితం. దిలీపుడి ధర్మ దీక్ష ఎలాంటిది. ఇతని కామ దీక్ష ఎలాటిది. ధర్మా విరుద్దో భూతేషు కామోస్మి అన్నాడు భగవానుడు. ధర్మ విరుద్దమైన కామం జీవితాని కెప్పటికైనా ముప్పే. అర్థ కామాలు ధర్మంలో ధర్మం మోక్షంలో పర్యవసానం చెందాలి. అదే సమగ్రమైన జీవితం. ఇక్కడ విజ్జోడు పడింది. ముప్పు తెచ్చింది. ఇలాంటి ముప్పు కొని తెచ్చుకో రాదని చెప్పటానికే కవి ఇలా కావ్యాన్ని ముగించింది. అందుకే ఆయా రాజుల చరిత్రల ద్వారా ఆత్మ జ్ఞానానికి తోడ్పడే దై వసంపద నంతా వర్ణించి రాను రాను దానికి భంజక

Page 73

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు