#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

సప్తర్షుల రాయబారం. సప్తమంలో అది ఫలించి వారి కళ్యాణం మహా వైభవంగా జరగటం. పోతే అష్టమంలో వారిరువురి శృంగార విలాసం.

  ఇలా చూస్తూ పోతే కావ్యమంతా శివశక్తుల సామరస్య నిరూపణమే. మిగతా కావ్యాల్లో ఇది పరోక్షంగా చేస్తే ఇందులో సాక్షాత్తుగానే ప్రతిపాదించాడు కవి తన ప్రత్యభిజ్ఞా సిద్దాంతాన్ని. సాక్షాత్తూ శివుడే అయినా సతీ వియోగం చేత జీవుడయ్యా డాయన. సతి అంటే శక్తి గదా. అది దూర మయింది తాత్కాలికంగా దూరమైతే శక్తి హీనుడు పరమాత్మ. నఖలు కుశలః స్పందితు మపి. కదలలేడు మెదల లేడు. స్థాణుభూతుడు. కనుకనే నిశ్చల సమాధిలో నిలిచి పోయాడు. పోతే ఇక పరాశక్తి ఆయనకు దూరమైతే అదీ బ్రతక లేదు. జడమై అస్తిత్త్వాన్నే కోలుపోతుంది. మరలా అస్తి అనిపించుకోటాని కొక స్థావరాన్ని ఆశ్రయించింది. జన్మించగానే అస్తి భాతి అయింది. చేతనమైన తత్త్వాన్ని పట్టుకొంటే గాని భాతి పరిపూర్ణమైన భానం కాదు. గురూపదేశం లాగా నారదుని ఉపదేశం పనిచేసింది. తండ్రి ఈశ్వర పరిచర్యకే నియోగించా డావిడను. కాని ఆ శివశక్తులు రెండూ కలిసే దెలాగా. కలవాలంటే కామమనేది ఉదయించాలి వారికి. దానికి వారిరువురి తపశ్చర్యా పరిచర్యాదీక్షా అడ్డు తగులుతున్నాయి. అది తొలగాలంటే కాముడు కలగ జేసుకోవాలి. అందుకు దేవేంద్రుడు పురికొలపాలి. దానికి తారకుడి బాధలు ప్రేరకం కావాలి. దానికి నిస్తారకమైన మాట బ్రహ్మదేవుడి నోటనే రావాలి. కనుకనే దేవతల కాయన ముందుగానే హామీ ఇచ్చాడు గోప్తారం సుర సైన్యానాం- బందీమివ జయ శ్రియమ్మని. కుమార జన్మ నిది ముందుగానే సూచిస్తున్నది.

  పోతే వారు చేసిన అంత ప్రయత్నమూ మధ్యలో విఫల మయింది. కాముడు ధూర్జటి కంటి మంటలో దగ్ధమయ్యాడు. ఆయన స్త్రీ సన్నికర్షం పనికి రాదని తిరోహితు డయ్యాడు. మరలా వియోగ మేర్పడింది శివశక్తులకు. ఎలా కలవటం. అందుకే రతి విలాప మంతగా వర్ణింతాడు కవి. రతి విలపిస్తే గాని ఆకాశ వాణి పలకదు. ఏమని పలికిందది. తదిదం పరిరక్ష శోభనే

Page 68

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు