#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

వివక్షితమైన కథాంశంతో ఓత ప్రోతంగా అల్లుకొని పోవాలి. అలా పెనవేసు కొన్నప్పుడే కవి వివక్షితమేదో అది అద్దంలో లాగా సహృదయుడికి స్ఫుటంగా కనిపిస్తూ కావ్యాని కొక చిక్కదన మాపాదించి కావ్యం ప్రబంధమనే పేరు సార్థకం చేసుకొంటుంది. ఇది కాళిదాసు కావ్యాలలో కనపడ్డట్టుగా ప్రాచీనమైన పురాణేతి హాసాల్లోనే గాక ఆయన కర్వాచీనమైన మాఘ భారవి నైషధాది పరశ్శత కావ్యాల్లో కూడా మనకు కనుపట్టదు. అనౌచిత్యానికి చాపల్యానికి గురి అయిన భాగా అనేకం కనిపిస్తాయి మనకా కావ్యాల్లో. అలాటి లోపం కాళిదాసు కావ్యాల్లో మచ్చుకు కనిపించదు. ఒక గొప్ప శాస్త్రజ్ఞుడి దృష్టి లాంటిది కాళిదాసు దృష్టి, రచనా ప్రణాళిక ఒకటి జా గ్రత్తగా మొదట తయారు చేసుకొని ఆ ప్రణాళికను తూచా తప్పకుండా అనుసరిస్తూ రచన చేశాడా అనిపిస్తుంది. రేఖామాత్ర మపి క్షుణ్ణా - దామనో ర్వర్త్మనః పరం. దిలీపుని ప్రజలు మర్గాన్ని దాటిఎలా వెళ్ళలేదో మనకు తెలియదు గాని వారిని వర్ణించిన కవి మాత్రం రేఖ కాదు గదా అందులో బిందువు కూడా వెళ్ళలేదని మనం బాహాటంగా చాటవచ్చు. మూడు కావ్యాల్లోనూ ముచ్చటగా దర్శన మిస్తుందిది.

  మొదట కుమార సంభవాన్నే తడవి చూతాము. ఎనిమిది సర్గల కావ్యమిది. ఎనిమిది గాక ఇంకా కొన్ని సర్గలు కలిపి పెద్దదిగా అచ్చువేసిన కుమార సంభవం ప్రతులు కొన్ని కనిపిస్తున్నాయిప్పుడు. అవి కుమార సంభవాలు కావు. కుకుమార సంభవాలని మరొక కువర్ణం ముందు చేర్చుకో వలసి ఉంటుంది. ఎవరో కాలాంతరంలో ఒక మహా పండితుడు కాళిదాసు కుమారసంభవం చదివి భక్తి పారవశ్యంలో పడి చేసిన హంగామా ఇది. కుమార సంభవమంటే కుమార స్వామి జననమని పొరబాటు పడి ఉంటాడా మహానుభావుడు. అందుకోసం శివపార్వతుల సమాగమ వృత్తాంతంతో నిలవక కుమారుడు జన్మించి తారకాసుర సంహారం చేయటం వరకూ ఏకరువు పెడుతూ పోయాడు కథను. కాళిదాసు కుమారుడి కథ నుద్దేశించి వ్రాయలేదీ కావ్యం. సంభవమనే మాటకు జన్మమని గాదు ఆయన ఉద్దేశించిన అర్థం.

Page 65

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు