#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

వాపోయాడు. కావ్య సామగ్రి నంతా ఆ తత్త్వానికి ద్యోతకం గానే కూర్చుకొంటూ పోతాడు కవి.

  అలా రచన చేసిన వాడే ప్రస్తుతం కాళిదాస మహా కవి కూడా. తనకు సిద్ధించిన ప్రత్యభిజ్ఞా దర్శనాన్ని బయట పెట్టటానికే ఆయన కావ్య రచనా నాటక రచనా కూడా. ప్రతి రచనలో నాయికా నాయకులు శివశక్తి ప్రతీకలే. వారి ప్రేమ కలాప మంతా శివ శక్తి సామరస్యమే. వారు మొదట కలుసుకొంటారు. తర్వాత ఏదో శాపవ శాత్తూ విడిపోతారు. మరలా శాప విమోచనమై శాశ్వతంగా కలిసి పోతారు. విడిపోవటానికి అనుచితమైన తమ మోహం కారణమైతే -తిరిగి కలుసుకోటానికి సముచితమైన జ్ఞానోదయం కారణం. మోహం మనః కాలుష్యం వల్ల కలిగితే ఆ కాలుష్యం పశ్చాత్తాపం వల్ల క్షాళిత మౌతుంది. జ్ఞానోదయ మైతే గాని పశ్చాత్తాప మేర్పడదు. జ్ఞానమనేది గురూపదేశం లాంటి ఏదో ఒక అభిజ్ఞానం వల్లగాని ఉదయించదు. అది జ్ఞానానికి దారి తీస్తే జ్ఞానం వల్ల అనుతాప మేర్పడితే అది చిత్తకాలుష్యాన్ని కడిగి వేస్తే - ఆ చిత్త శుద్ధి వల్ల మరలా పునస్సమాగమ సిద్ధి లభిస్తుంది. కాళిదాసు రచించిన కావ్యాలు గాని నాటకాలు గాని ఏవి చూడండి. ఈ దృష్టి వదల కుండా చూస్తే చాలు. ప్రతి కావ్యం లోనూ నాటకం లోనూ ఈ ప్రక్రియ ప్రదుల కుండా దర్శన మిస్తుంది భావుకుడి మనో నేత్రానికి,

  ఇది ఆ మహా కవి తన శ్రవ్య కావ్యాలలో ఎలా ప్రపంచించాడో మొదట పరిశీలించి చూద్దాము. శ్రవ్య కావ్యా లాయన రచించినవి మనకు తెలిసి మూడే మూడు. కుమార సంభవం- రఘువంశం- మేఘదూతం. మూడూ వాల్మీకి రామాయణ స్ఫూర్తితోనే రచించాడని ఇంతకు పూర్వమే సూచించాను. అయితే అది స్ఫూర్తి మాత్రమే. ఎంత స్ఫూర్తి అయినా కాళిదాసు దృష్టి వేరు. ఆయన కావ్య సృష్టి వేరు. తన దృష్టి బలంగా తన సృష్టిలో ముద్రితం కావాలంటే అది రామాయణం లాగా భారతం లాగా ఒక ఇతిహాస ధోరణిలో నడవ రాదు. అచ్చమైన కావ్య ధోరణిలోనే సాగాలి. ఇతిహాసంలో వస్త్వెక్య మనేది ఉండదు.

Page 61

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు