సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఆవిడ ఉద్దేశం తెలిసే వరకూ గాబరా పడ్డ ఋజ వర్తనుడు. తెలిసిన తరువాత ఆవిడ తన బాధలు చెప్పుకొంటుంటే విని ఎంతగానో జాలి పడ్డ రసార్ద్ర హృదయుడు. పితృ దత్తమైన కంకణం సరస్సులో పడి మాయమైతే అమోఘమైన శరంతో సరోవరాన్ని ఒక నేలకు కోలకు తెచ్చి అది ఎరిగి నాగరాజు పాతాళం నుంచి వచ్చి కుముద్వతి అనే కన్యతో సహా ప్రత్యక్షమై కంకణాన్నీ కన్యామణినీ సమర్పిస్తే సమాధాన పడతాడు. ఎక్కడి పాతాళం. ఎక్కడి భూలోకం. భూలోక వాసికి పాతాళ వాసిని నాగకన్య సహధర్మ చారిణి. ఆ నాక రథ వర్త్మనా మని నాకం వరకూ రథం నడపిన రాజన్యులకు నాగం వరకూ దృష్టి సారించట మొక విశేషమా. రెండు కొసలూ స్పృశించిన జీవితాలవి. అలాటి మానవ జీవితమే పరిపూర్ణ జీవితమని కవి వివక్షితం.
కుమార సంభవంలో చూడండి. ఇక జడం లేదు. చేతనం లేదు. ప్రకృతి అంతా ఏకమే. మానవుడికి సృష్టి అంతా విహార రంగమే. జడమైన పర్వతంతో ప్రారంభ మయింది కథా గమనం. జడమా అది. చేతనాలలో చేతనం. అచేతనాలలో అచేతనం. పితృదేవతల మానస కన్య మేనకను వివాహ మాడిందా పర్వతం. గంగా గౌరీ లనే కన్యలను కాంచింది. అంతకు ముందే మైనాకుడనే కుర్రవాడికి జన్మ నిచ్చింది. ఈశ్వరుడు తన కతిథిగా వస్తే ఆశ్రయ మిచ్చింది. కుమార్తె చేత ఆయనకు పరిచర్య చేయించింది. చివరకు సప్త మహర్షులతో పెండ్లి మాటలు మాటాడింది. అపమేఘోదయం వర్షం. మీరాక మేఘం లేని వర్షం మా పాలిటికి. జంగమం ప్రేష్య భావేవః స్థావరం చరణాంకితం. నా జంగమ దేహం మీ సేవకైతే నా స్థావర శరీరం మీ నివాసాని కర్పిత మంటుంది. దానికి వారే మంటారో తెలుసా. మనసః శిఖరాణాం చ - సదృశీ తే సమున్నతిః. నీవు మహాను భావుడవు. నీ శిఖరాలకు తగినట్టే అత్యున్నత మైనది నీ మనస్సు అని అభినందిస్తారు. ఏమిటీ చిత్రం. ఏది అచేతన మిందులో ఏది చేతనం. చేతనా చేతనాల పరస్పర సంవ్యవహార మెంత అద్భుతంగా సాగిందీ వర్ణనలో. ఇంతకన్నా సామరస్య మేముంది
Page 227