సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
కలిపి ముడి వేసిన ఈ సత్సంబంధ సామరస్య మెక్కడైనా చూడగలమా మనం. ఎంత హృదయంగమ మైన సృష్టి ఇది. ఈ సృష్టిలోని ఆంతర్య మేమిటి. ఒక్క మానవుడే వాడి జీవితమే గాని మరేదీ లేదు. దైవ గుణాలూ అసుర గుణాలూ వాడిలోనే ఉన్నాయి. మొదటి దానిలో ఎంత దూరం పైకి ప్రాకితే అంత స్వర్గ సుఖమనుభవిస్తాడు. రెండవ దానిలో ఎంత దిగ జారితే అంత పాతాళంలో పడిపోతాడు. రెంటిలో హేయాన్ని వదిలేసి ఉపాదేయాన్ని మాత్రం పట్టుకొని పోతే వివేక శాలి అయిన మానవుడవుతాడు విజయాన్ని చవి చూస్తాడని చెప్పటమే కవి తాత్త్విక హృదయం.
దేవత లేమిటి. మానవు లేమిటి. దైవ గుణముంటే వాడే దేవత. మానవుల మధ్య తిరిగే ఆ దేవత లెవరో కారు. మహర్షులు. తపస్సంపన్ను లైన కణ్వ కశ్యపాది మహర్షి పాత్రలను కాళిదాసు సృష్టించింది ఈ దృష్టితోనే. వారు నిర్లిప్తులూ నిరాడంబరులూ. పోతే వారెవరి ఏలుబడిలో ఉన్నారో వారు మహారాజులు. భోగులూ యశో భాగులూ. వారికీ వీరికీ ముడి పెడతాడు కాళిదాసు. పైగా రాజ్యాశ్రమ మునిం మునిః అంటాడు. వారాశ్రమ వాసులైతే ఈ రాజులూ అలాటి వారేనట. వీరి ఆశ్రమం రాజ్యమే. వీరి తపస్సు ప్రజాపాలనమే. ఏమిటీ మాట. వారు చూడని తేడా మనకు దేని కంటాడు కవి. అంతేనా. ఎంత నిరాడంబరులో అంత లౌకికు లా మహర్షులు. ఎంత భోగ జీవులో అంత త్యాగ ధనులీ రాజులు. ఈ చిత్రం చూడండి. త్యాగాయ సంభృతార్థానా మని వర్ణించాడు కవి ముందుగానే. రఘు మహారాజు దిగ్విజయం చేశాడు. ఎన్నెన్నో ధన రాసులు పోగు చేసుకొన్నాడు. ఎందుకు. తానొక్కడే పావుకోటానికా. కాదు. విశ్వజిత్తనే యాగం చేశాడు తరువాత. అది ఒక నెపం. దానితో పోగు చేసిందంతా పేద సాదలకు యాచకులకు దానం చేశాడు. నిర్ధను డయ్యాడు. ధనం సంపాదించే టపుడూ లేదు స్వార్థం. దానం చేసి నిర్ధను డైనపుడూ లేదు దాని చింత. అప్పుడు రాజైతే ఇప్పుడు తపస్వి అతడు. ఒక తపస్వి వచ్చాడాయన వద్దకు డబ్బు కావాలని.
Page 210