#


Index

స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

ప్రస్తుతం దేవతల స్వైర విహారాని కడ్డు తగులుతున్న రాక్షస సెన్యాన్ని అపవాద సూత్రంతోనూ వారిచేత దెబ్బ తిని పోయిన దేవతలను ఉత్సర్గ సూత్రంతోనూ పోల్చి చెప్పట మెంత అందమిస్తున్నదో చూడండి రచనకు. ఇలాటి అందం మాఘ భారవి ప్రభృతులలో లేదు. వ్యాకరణాన్ని కూడా కావ్యంగా మలిచి చెప్పటం కాళిదాసుకే తెలిసిన విద్య.

  వ్యారకణ మేమిటి. తర్కం కూడా ఇంతే కాళిదాసు చేతిలో. వ్యాకరణం పదమైతే ఇది ప్రమాణం. కాణాదం పాణినీయంచ సర్వ శాస్త్రోప కారక మన్నారు పెద్దలు. పద ప్రమాణాల పరిజ్ఞాన ముంటే అది సకల శాస్త్రాలకూ జవాబు చెప్పగలదట. పద ప్రమాణాలంటే భంగ్యంతరంగా శబ్దార్థాలే. ఏది చెప్పాలో అది అర్ధం. దేనితో చెప్పాలో అది శబ్దం. శబ్ద ప్రౌఢి ఎంతగా ఉందో కవిలో తత్ప్రతిపాదితమైన అర్థ రచనలో కూడా అంతే ప్రౌఢి. పూర్వాపరాలకు హేతు హేతుమద్భావ మేమాత్రమూ బెసగ కుండా ఎంతో పకడ్బందీగా సాగుతుంది రచన. ఇది ముఖ్యంగా ఆయన పాత్రల చేత అక్కడక్కడా సాగించే సంవాదాలలో తార్కాణ మవుతుంది మనకు. మచ్చుతునకగా ఒక దిలీప సింహ సంవాదాన్నే తీసుకొని చూడవచ్చు. మాటకు మాట ఎంత పొందికగా సాగిందో చదివి తీరాలి సహృదయులు. వాకో వాక్యమని పేరు తర్కానికి. అంటే మాటకు మాట అనే అర్థం. అది కాళిదాసులో విశ్వతో ముఖంగా మనకు దర్శన మిస్తుంది.

  ఇక షడ్దర్శనాల పాండిత్యమా కొట్టిన పిండి మహా కవికి. వాటి సంస్కార మెప్పటి కప్పుడుద్గరం లాగా పరిమళిస్తూనే ఉంటుంది రచన లన్నింటిలో. న్యాయ వైశేషికాలు రెండూ హేతువాదం క్రిందికే వస్తాయి. వాటికి నిదర్శనం వెతుకుకో నక్కర లేదు. అన్యూనానతి రిక్తంగా సాగిన ఆయా పాత్రల సంభాషణ లన్నీ దానికి నిదర్శనాలే. పోతే సాంఖ్య యోగ పరిజ్ఞానం చెప్పనక్కర లేదు. ఆయా దేవతలు బ్రహ్మాదులను గూర్చి చేసే స్తోత్రాలలో

Page 15

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు