స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
భరతమునే సూత్రధారుడై లక్ష్మీ నారాయణ పరిణయ మనే నాటకం వేయిస్తాడు దేవలోకంలో . అందులో నాయిక ఊర్వశే. పురుషోత్తముడని సంభోధించటానికి మారుగా పురూరవుడని సంబోధించి శాపం నెత్తికి తెచ్చు కొంటుంది కూడా. అగ్ని మిత్రుడికి నాట్య కళ మీద ఎంత వ్యామోహమో బహుశా పురూరవుడికి సంగీత కళ మీద అంత ఉండి ఉంటుంది. ఊర్వశి వియోగ దశలో ఎన్ని పాటలు పాడాడో ఎన్ని రాగాలలో ఎన్ని దరువులు వేస్తూ పోయాడో ఆ అనాహత నాదాన్ని అంతరంగం లోనే వినాలి మనం. వీణ అంటే ఎంతో ఇష్టమై ఉంటుంది కాళిదాసుకు. వీణాగానం వర్ణించని సందర్భమే లేదాయన కావ్యాలలో నాటకాలలో. ఉత్సంగేవా మలిన వసనే సౌమ్య నిక్షిప్య వీణాం అని మేఘదూతంలో యక్షకాంత అన్నీ మానినా గానం మాత్రం మానలేదు. రఘువంశంలో కడపటి చక్రవర్తి అగ్ని వర్ణుడికి వీణ ఎంత ప్రియ మయిందంటే వాడి ప్రియురాలి అంత ప్రియ మయింది. ఒడిలో ఒకటి తప్పితే ఒకటి ఎప్పుడూ ఉండవలసిందే. వల్లకీచ హృదయంగమ స్వనా -వల్గువాగపిచ వామలోచనా. వల్లకి అయినా వామ లోచనయినా ఏదో ఒకటి. రెండూ ఏకకాలంలో నేమో కూడా. మరి అజమహారాజు గతప్రాణమై పడిపోయిన కాంత శరీరాన్ని కూడా వీణ తంత్రులు సవరించినట్టే గారాబంగా సవరిస్తూ కూచున్నాడు. అసలు సంగీత మంటే గాత్రం తరువాత జంత్రం వీణే జ్ఞాపకం వస్తుంది కాళిదాసుకు.
పోతే ఇక చిత్రలేఖన మనేది ఆ రాజులందరికీ సర్వ సాధారణ మయినట్టు వర్ణిస్తాడు కవి. అగ్ని మిత్రుడేమి విక్రముడేమి దుష్యంతుడేమి అందరూ గొప్ప చిత్రకారులే. ప్రియురాలి వియోగ మెప్పుడు సంభవిస్తే అప్పుడొక చిత్ర ఫలకం పట్టుకొని కూచుంటారు. రకరకాల వర్ణాలతో అద్భుతంగా నాయిక ఆకారాన్ని చిత్రించి ఆరాటాన్ని మరచి పోతుంటారు. చిత్రే నివేశ్య పరికల్పిత సత్త్వ యోగా అసలు బ్రహ్మదేవుడీ శకుంతల బొమ్మ
Page 10