అయితే దీనిమీద మనం మరలా సంజాయిషీ చెప్పుకోవలసిన ప్రశ్న ఒకటున్నది. అదేమంటే జ్ఞానమనేది వస్తుతంత్రమని వర్ణించారు మీరు. వస్తుతంత్రమంటే ఆయా వస్తువుల స్వభావాన్ని బట్టి ఏర్పడేది. మరి వస్తువనేది మనకు బాహ్యంగా కనిపించే పరినిష్ఠితమయిన Established పదార్థం. దాన్ని చూడగానే మన మనసులో దాని తాలూకు వృత్తి ఒకటి జన్మిస్తుంది. దానినే మనం జ్ఞానమంటున్నాము. ప్రస్తుతం మీరు పేర్కొనే బ్రహ్మం కూడా అలాంటి ఒక పరినిష్ఠతమైన పదార్థమే. పైగా మిగతా జాగతిక పదార్ధాలలాగా అది ఏదో ఒకచోట ఏదో ఒక కాలంలో ఒకానొక రూపంలో నియంత్రితమై Confined ఉన్నది కూడా కాదు. సార్వత్రికమూ, సార్వకాలికమూ, సార్వవస్తుకమూ అయిన వస్తువని మీరే నిర్దేశిస్తున్నారు. అలాంటిదాన్ని గ్రహించి అర్థం చేసుకొనే బుద్ధి అనే ప్రమాణం కూడా మనవద్ద అనుక్షణమూ ఉండనే ఉంది. ఇలా ప్రమాణ ప్రమేయాలు రెండూ సిద్ధమయి ఉన్నప్పుడిక జ్ఞానమనేది దానిపాటికది ఎట్లాగూ నిష్పన్నమవుతుంది గదా మరి మధ్యలో మనకీ శాస్త్రమనే రాయబారి దేనికి. ఒకవేళ ఉందనుకొన్నా నిర్జీవమైన శాస్త్రం వస్తువునెలా గ్రహించగలదు. ఎప్పటికైనా సజీవమైన మానవుడి బుద్ధికే గదా అది గోచరించవలసింది. ఆ బుద్ధి ఎలాగూ మనదగ్గరే ఉంది. అలాంటప్పుడిక శాస్త్రమనే దాని ప్రసక్తి మనకు దేనికని ప్రశ్న రావటం సహజమే.
ఇక్కడే శాస్త్రానికుండే ప్రాధాన్యమేమిటో మనకు స్పష్టంగా తెలిసిపోతుందంటారు శంకరులు. ప్రతివాదులే శాస్త్రం మన కక్కరలేదని వాదిస్తున్నారో చివరకాశాస్త్రమే మనకు శరణ్యమవుతున్న దంటారాయన. ఎందుకని. బ్రహ్మమనేది ఒక సిద్ధమైన వస్తువనే మాట వాస్తవమైనా అది మనకు ప్రమేయమయ్యే వస్తువు గాదు. మిగతా లౌకిక వస్తువుల సంగతి వేరు. ఏదో ఒక ప్రమాణానికవి ప్రమేయ మవుతుంటాయి. మన దగ్గర ఉన్న ప్రమాణాలు రెండే. ఒకటి చక్షురాదులైన ఇంద్రియాలు. ఇవి ప్రత్యక్ష ప్రమాణం. రెండు మనస్సనే అంతరింద్రియం. ఇదే అనుమాన ప్రమాణం. ఇంతకు మించి మరొక ప్రమాణం లేదు మన అనుభవంలో. ఏ వస్తువును గ్రహించినా మన మీరెండు ప్రమాణాల సహాయంతోనే గ్రహించాలి. మరో మార్గంలేదు.
Page 99