#


Back

   స్పర్శ రూప రసగంధాలే గదా మనం గ్రహించవలసిన విషయాలు. అవి మనకు బాహ్యంగా దృష్టమైనంత వరకూ భయంలేదు. చక్షురాదికమయిన ప్రత్యక్ష ప్రమాణంతోనే గ్రహిస్తాము. అయితే అంతా అలా ఎప్పుడూ దృష్టమవుతుందని చెప్పలేము. ఒకప్పుడు కొంత గోచరమయి కొంత అగోచరం కావచ్చు. అప్పుడీ దృష్టమయిన అంశాన్ని ఆధారం చేసుకొని అదృష్టమయిన భాగాన్ని అన్వేషించవలసి వస్తుంది. అలా అన్వేషించి తెలుసుకొనేదే మనోవృత్తి రూపమైన అనుమాన ప్రమాణం. దీనితో ప్రమేయ జగత్తంతా మానవుడి పరిధిలోకి వస్తున్నది.

   పోతే ప్రస్తుత మీ బ్రహ్మమనేది ఒక్కటే ఇలా ప్రేమయ కోటిలో చేరని వస్తువయి కూచున్నది. వస్తువైనా ఆత్మరూపం గనుక అప్రమేయమది. నామరూపాదులేవీ లేనిది కాబట్టి చక్షురాది ప్రత్యక్ష ప్రమాణమక్కడ పని చేయదు. ప్రత్యక్షమే పని చేయకపోతే అనుమాన మసలే పనికి రాదు. ప్రత్యక్షాన్ని అనుసరించి కలిగేది గదా అనుమానం. ఏదో ఒక అంశం ప్రత్యక్షమయితే దాన్ని బట్టి మిగతా భాగమనుమేయ Inferred మవుతుంది. ఇలాంటి అంశానికే తార్కికులు లింగమని పేరు పెట్టారు. ధూమమనేది అగ్నికి లింగం Indicator ఇలాంటి లింగ పరామర్శకే మాత్రమూ ఆస్పదం లేదు బ్రహ్మ విషయంలో. కాబట్టి అనుమానప్రమాణం కూడా అక్కడ నిరుపయోగమే. ఇవి రెండే మనకున్న ప్రమాణాలు. రెండూ ఇలా నిర్వీర్యమయిపోతే ఇక మన గతి ఏమిటి. బ్రహ్మతత్వాన్ని పట్టుకోటాని కసలు ప్రమాణమే లేకుండా పోతుంది. అప్రమాణమైన దాని కసలస్తిత్వమే లేదని మన సిద్దాంతం.

   అంచేత అవశ్యంగా మరొక ప్రమాణాన్ని మానవుడు శరణు వేడవలసి వస్తున్నది. అదే శాస్త్రమనే మూడవ ప్రమాణం. ప్రత్యక్షానుమానాల కసాధ్యమైన దాన్ని ఇది సాధిస్తుంది. వాటి కతీతమైన జ్ఞానాన్ని మనకందిస్తుంది. వాటి కతీతమైన విషయాలు ఒకటి దర్మం Religious fact. మరొకటి బ్రహ్మం. Philosophical fact. రెండు మానవాతీతమైన రహస్యాలను మనకు బోధించటానికే శాస్త్రమనేది అవతరించింది. ఇందులో కూడా ధర్మమనేది నామరూపాత్మకమైన ద్వైతప్రపంచ పరిధిని దాటిపోలేదు. కాబట్టి అదైనా ప్రమేయమవుతుందేమో గాని అనామ రూపాత్మకమైన బ్రహ్మమనే అద్వైత సత్యమసలే ప్రమేయంకాదు. అసలేకాకపోతే దానికి శాస్త్రం మాత్రమెలా పనికి వస్తుందని ఆశంక చేయవచ్చు.

Page 100