#


Back

   దానికి శంకరులిచ్చే సమాధానమేమంటే శాస్త్రమనే దాన్ని ఒక దీపంలాగా చూడమంటారాయన. దీపమనేది పదార్ధాన్ని క్రొత్తగా తయారుచేయదు. పదార్థమక్కడేఉన్నది. అయితే దాన్ని చీకటి ఆవరించి ఉంది. అందు మూలాన అది మనకంటికి కనపడటం లేదు. ప్రస్తుతమది కనపడాలంటే దాన్ని కప్పి ఉన్న చీకటి తెర తొలగితే చాలు. కనపడుతుంది. ఆ తొలగించటమే దీపం చేసే పని. అంతకుమించి మరేమీ లేదు.

   శాస్త్రం కూడా ప్రస్తుతమిలాంటి కార్యమే నిర్వర్తిస్తున్నది. మీరు చెప్పినట్టు బ్రహ్మమనేది సర్వత్రా ఉంది. దాన్ని ఎవరూ క్రొత్తగా సృష్టించనక్కరలేదు. మరి దాన్ని పట్టుకోగల బుద్ధీంద్రియం కూడా మనలనంటి పట్టుకొనే ఉంది. అయినా మన కర్ధం కావటం లేదంటే ఏమిటర్ధం చీకట్లో వస్తువున్నా చూచే నేత్రమున్నా సరిపోదు. చీకటనే ఆవరణాన్ని తొలగించే దీప ప్రకాశమొకటి తోడు కావాలి కదా. అలాగే ఇక్కడ మనకు దీపస్థానీయమైన శాస్త్ర ప్రమాణమొకటి అవస్యంగా జతపడాలి. దాని సహకారం లేకపోతే బ్రహ్మ పదార్ధమెంత సర్వవ్యాపకమయినా బుద్ధి దానికెంత అభిముఖంగా ఉన్నా సుఖం లేదు దాన్ని ఎన్ని జన్మలకూ పట్టుకోలేము మనం.

   అయితే సజీవమయిన బుద్ధి పట్టుకోలేనిది- నిర్జీవమయిన శాస్త్రం మాత్రమెలా పట్టుకోగలదని గదా మీ ప్రశ్న. దీనికింతకు ముందే సమాధానమిచ్చి ఉన్నాము. శాస్త్రమంటే కాగితమూ, అక్షరమూ కాదు. అక్షరమయిన మన ప్రాచీన మహర్షుల అనుభవమే శాస్త్రం. అదే గ్రంథ రూపంగా మనకిప్పుడు ప్రత్యక్షమవుతున్నది. ఇది వారి అనుభవ గర్భయిన మాట కాబట్టి సజీవమే. అప్పటికది మరలా పురుష తంత్రమే గదా అని ఆక్షేపించరాదు. సామాన్య బుద్ధి కతీతమయిన సమాధి దశలో దర్శించిన సత్యం కాబట్టి అది అపౌరుషేయమని Supramental ముందే తీర్మానించాము. అంచేత పురుష తంత్రమనే ఆక్షేపణ లేదిక వస్తుతంత్రమే.

   అయితే వస్తుతంత్రమయినా బ్రహ్మమనేది దేనికీ విషయం కాదని గదా ప్రతిపాదించారు. వస్తుస్వభావమలాంటి దయినప్పుడది శాస్త్ర ప్రమాణానికి మాత్రమెలా ప్రమేయమవుతుందని మరలా ఆక్షేపించవచ్చు. దీనికి కూడా సమాధానం చెప్పే ఉన్నారు శంకర భగవత్పాదులు.

Page 101