#


Back

   శాస్త్రమనేది మిగతా ప్రత్యక్షాది ప్రమాణాల లాగా సాక్షాత్తుగా పట్టి ఇవ్వదు ప్రమేయాన్ని విధి ముఖంగా కాక నిషేధ ముఖంగా సూచిస్తుంది దాన్ని. దానితో ఆవరణ భంగమై తత్త్వజ్ఞానమనేది మనకు నాంతరీయకంగానే Automatic సిద్ధిస్తుందంటారు దేశికోత్తములు. తత్త్వాన్ని శాస్త్రం సాక్షాత్తుగా పోయి స్పృశించదు గనుక అప్రమేయమనే మాటకు తిరుగులేదు. అయినా దానిజ్ఞానం మన కందుతూనే ఉంది కాబట్టి ఒక విధంగా మనకు ప్రమేయం కూడా అవుతున్నది. దీనివల్ల అప్రమేయం ప్రమేయమెలా అవుతుందనే విప్రతిపత్తికి Contradiction కూడ చోటు లేదు.

   అంచేత శాస్త్రమనేది మన చక్షురాదీంద్రియాల మాదిరీ-బుద్ధి అనే అంతరేంద్రియం మాదిరి మనకు సన్నిహితం కాకపోయినా వాటికన్నా బరోసా పడదగిన ప్రమాణం. చక్షురాదులు కేవలం మన స్వరూపానికి వ్యతిరిక్తమయిన అనాత్మ వస్తువులనే మనకెప్పుడూ ప్రదర్శిస్తుంటాయి. బుద్ధివృత్తులు కూడా తజ్జన్యమైన వాసనా ప్రపంచాన్నే మనకు చూపుతుంటాయి. అంతేగాని తద్విలక్షణమైన ఆత్మజ్ఞానాన్ని మనకవి రెండూ అందివ్వలేవు. మరి ఈ శాస్త్ర ప్రమాణమలా కాదు. అనాత్మ జగత్తునంతా కొట్టివేసి మరుగుపడిన మన ఆత్మస్వరూపాన్నే మనకు ముమ్మూర్తులా చూపుతుంది. అసలాత్మ మనకు ప్రత్యక్షం కావటం లేదంటే హాస్యాస్పదం. ఆత్మ అంటే మన స్వరూపమే. మన స్వరూపమే అయి ఉండి మనకది ఎందుకు ప్రత్యక్షం కాదు. దాని మీద అనవసరంగా వచ్చి పడ్డ అనాత్మ ప్రపంచం వల్లనే అది ప్రత్యక్షం కావటంలేదు. మీదు మిక్కిలి పరోక్షంగా ఎక్కడో ఉన్నట్టు భాసిస్తున్నది. ఇప్పుడా అనాత్మ నిర్మాల్యాన్నంతటినీ నిరాకరిస్తుంది కాబట్టి శాస్త్రమే ఆత్మ ప్రత్యక్షానికి తోడుపడే ప్రమాణమైంది విషయ జగత్తనే ప్రతిబంధ మణుమాత్రం కూడా తొలగించలేని చవటలు కాబట్టి ప్రత్యక్షానుమానాలే నిజానిక ప్రమాణ మవుతున్నాయి.

   అసలు రహస్యమేమంటే శాస్త్రమనేది ఒక శబ్దం మాత్రమే Utterance అయినా ఆ శబ్దం మన చెవిలో పడి మనసు కెక్కుతుంది. వెంటనే ఆ శబ్దం చెప్పే అర్థమేదుందో దాన్ని భావన చేస్తుంది మనస్సు ఆ భావన కనురూపమయిన ఒక రూపం మన మనః ఫలకం మీద హఠాత్తుగా హత్తుకొంటుంది. ఈ రీతిగా శబ్దమనుమాన స్థాయికి దిగి ఆ అనుమానం ప్రత్యక్ష స్థాయికి దిగివస్తున్నది కాబట్టి శబ్ద ప్రమాణమే చివరకు ప్రత్యక్ష ప్రమాణమయింది.

Page 102