#


Back

   అంచేత అది ఏదో మనకు దూరమని భావించనక్కరలేదు. దూరంగా కనిపించినా అదే సత్యమైన స్వరూపాన్ని పట్టి ఇచ్చి మనకు సన్నిహిత మవుతున్నది. పోతే సన్నిహితంగా ఉన్నట్టు భ్రమ కొలుపుతూ అసత్యమైన అనాత్మ జగత్తునే నిత్యమూ ఇలా ప్రదర్శించే ఈ ప్రత్యక్షానుమానాలే మనకు దూరమవుతున్నాయి. కాబట్టి శాస్త్రమే సజీవం. నిర్జీవమివే నిజానికి. పురుష సంబంధులు కాబట్టి ఇవి రెండూ పురుషతంత్రమైన జ్ఞానాన్నే మనకిస్తాయి. ఆ జ్ఞానమెప్పుడూ భ్రమ ప్రమాదాలకు లోనైనదే. అది యథా భూత విషయమెలా అవుతుంది. యథాభూత జ్ఞానమే కావాలంటే అది వస్తుతంత్రమే కావాలి. అలాంటి వాస్తవికమైన జ్ఞానం మనకి ఆగమరూపమైన శాస్త్ర ప్రమాణమే ప్రసాదించాలి గాని మరేదీ గాదు. అది ఒకవేళ విద్యుపాసనా రూపమైన కర్మకలాపాన్ని బోధించినా పురుషుల బుద్దిబేధాన్ని అనుసరించి బోధించటమే గాని తాత్పర్య దృష్టితో గాదు. తాత్పర్యం దానికి వస్తుతంత్రమైన ఈ అద్వైత జ్ఞానాన్ని మనకందించటమే. జ్ఞానప్రాప్తి కుపాయ భూతంగానే Means ఆ కర్మోపాసనలను కూడా మనకది ఏ కరువు పెట్టటం.

   అయితే అన్నీ అయిన తరువాత ఇప్పుడాఖరు సారిగా మనం జవాబు చెప్పుకోవలసిన ఆక్షేపణ ఒకటుంది. బ్రహ్మమనేది వస్తుసిద్ధం. దానిని సాధించటానికి వస్తుతంత్రమైన జ్ఞానం తప్ప పురుషతంత్రమైన కర్మాదికమేదీ పనికి రాదని తీర్మానించారు. బాగానే ఉంది. కాని జ్ఞానానికి ముందు గాకపోయినా జ్ఞానోదయమైన తరువాత మరలా మనకు కర్మ కావలసిందే గదా. ఎందుకంటే మనకు కలిగిన ఆ జ్ఞానం కేవలం మానసికమే. అది ఆ బ్రహ్మ తత్త్వానికి చెందిన ఒకానొక ప్రత్యయం Idea. ప్రత్యేయమే పదార్థమెలా అవుతుంది. ప్రత్యయం వేరు. పదార్థం వేరు పదార్థమనేది మనకు బాహ్యంగా ఎక్కడో ఉంటే దాని తాలూకు బొమ్మ Image ఒకటి మనసులో కనిపిస్తుంది మనకు. ఈ కనిపించే చిత్రాన్నే జ్ఞానమని పేర్కొంటున్నాము మనం. ఇది ఆ జ్ఞేయమైన వస్తువు చిరునామా మాత్రమే.

Page 103