#


Back

   ఈ చిరునామా పట్టుకొని పోయి వెతికితేగాని ఆ పదార్థం మనకు దొరకదు. కేవల జ్ఞానమే తత్రాప్తి కానేరదు. ఒక ఇల్లు కట్టే జ్ఞానమున్న మాత్రాన అది ఆ ఇంట్లో చేరటం కాదు గదా. పాకజ్ఞాన మున్నంత మాత్రాన పక్వమైన భక్ష్యాలను రుచి చూడటం కాదు గదా. అలాగే బ్రహ్మజ్ఞానమే బ్రహ్మానుభవం కాబోదు. అనుభవమే కావాలంటే ఈ జ్ఞానమే బ్రహ్మతత్త్వానికి చెందిందో ఆ తత్త్వాన్ని వెదకి పట్టుకొనే ప్రయత్నం చేసి తీరాలి. ప్రయత్నమే చేయవలసి వస్తే అది ఒక కర్మే గదా. అలాంటప్పుడు జ్ఞానం వస్తుతంత్రమని మురిసిపోయి సుఖమేముంది. దానికి మరలా పురుషతంత్రమైన కర్మ తోడు కావలసిందే గదా అని ఆక్షేపణ.

   దీనికి శంకరులిచ్చిన సమాధానమే సమాధానం. ఎంతో సూక్ష్మేక్షిక Keen Insight తో పరిశీలిస్తే గాని అందులోని ధర్మసూక్ష్మం మన ఆకళింతకు రాదు. అదేమిటంటే పూర్వపక్షులు చేసే ఆక్షేపణ ఈ ద్వైత జగత్తులో అయితే సరిపోతుంది గాని అద్వైత విషయంలో అది ఏ మాత్రమూ వర్తించదంటారాయన. ద్వైతమంటే ఇటు లోక వ్యవహారమైనా కావచ్చు. అటు శాస్త్ర వ్యవహారమైనా కావచ్చు. ఎందులోనైనా జ్ఞానం వేరు. అనుభవం వేరు. ఒక పాక జ్ఞానమే పాకం కాదు. గృహజ్ఞానమే గృహం కాదు. మనకు బాహ్యంగా లోకంలో ఉన్నాయవి. పోయి ప్రవేశించవచ్చు. వండి రుచి చూడవచ్చు. అలాగే ఒక జ్యోతిష్టోమ యాగం చేయాలని శాస్త్రం బోధించిందంటే ఆ బోధే యాగంకాదు. కిమ్-కేన-కథ-మ్మనే మూడు భావాలకు జవాబు చెబుతూ దానికి కావలసిన ఋత్విక్కులూ- అగ్నిహోత్రమూ-సమిధలూ- ఇలాంటి సామగ్రి నంతా పోగు చేసుకొని బాహ్యంగా ఒక కర్మ నాచరిస్తేనే అది యాగమవుతుంది. ఇలా జ్ఞానం కంటే భిన్నంగా క్రియ అనేది ఒకటుంది. వీటిలో జ్ఞానం క్రియగా మారినప్పుడే అది అనుభవంగా చలామణి అవుతుంది. అంతేగాని జ్ఞానమే అనుభవం కాదు. ఇది ద్వైత వ్యవహారం వరకూ సత్యమే. కనుకనే దానికి పురుష తంత్రమని ముద్ర వేసింది మనం. పురుషుడి చెప్పుచేతలలో ఉందీ వ్యవహారమంతా.

   పోతే ప్రస్తుత మీ అద్వైత వ్యవహార మలాంటిది గాదు. ఇది వస్తుతంత్రమని చెప్పాము. వస్తువనేది అద్వితీయమైన బ్రహ్మత్వం. జీవజగత్తులనే వాసన కూడా మిగల్చని పరిపూర్ణ చైతన్యమది.

Page 104