దానికి బాహ్యంగా జ్ఞేయమైన బ్రహ్మమంటూ మరొకటి ఏదీ లేదు. "ప్రజ్ఞానమ్ బ్రహ్మ- విజ్ఞానమానందమ్ బ్రహ్మ” అన్నప్పుడు బ్రహ్మమనేది జ్ఞాన స్వరూపమే. అది జ్ఞేయమెలా అవుతుంది. జ్ఞేయమయ్యేది ప్రపంచమే. ఆ ప్రపంచం కూడా ఏదో గాదు బ్రహ్మమేనని నిరూపించాము. ప్రపంచమంతా లయమైన తత్త్వమే బ్రహ్మమని తేల్చుకొన్నప్పుడిక మరలా దాన్ని ఈ ప్రపంచంలో ఎక్కడ ఉందా అని వెతకటమేమిటి. పట్టుకోటమేమిటి. వెతకటానికీ - పట్టుకోటానికీ బాహ్యంగా జ్ఞేయ ప్రపంచమొకటి ఉంటే గదా. జ్ఞానమైనా అదే. జ్ఞేయమైనా అదే. లేకపోతే పరిపూర్ణమనే మాటకర్థమే లేదు. పరిపూర్ణమన్నప్పుడంతా బ్రహ్మమే. బ్రహ్మేతర పదార్ధమే ఉండరాదు.
కాబట్టి జ్ఞానమే అనుష్ఠానమిక్కడ. అంతకన్నా అనుష్ఠానమంటూ క్రొత్తగా ఏదీ లేదు. అనుష్ఠాన-మనుషేయ-మనుష్ఠాత అనే త్రిపుటికెంత మాత్రమూ అవకాశమీయని పదార్ధమది. పురుషతంత్రమైనదైతే ఉంటుందిగాని వస్తుతంత్రమైనది గనుక అలాంటి అవకాశమే లేదిక్కడ. ముందూ లేదు. వెనకా లేదు. మహా అయితే ఆ జ్ఞానముత్పన్నమైన తరువాత ఇంకా మన ప్రారబ్దం కొద్దీ ఈప్రపంచం భాసిస్తుంటే ఎప్పటికప్పుడు దాన్ని బ్రహ్మ చైతన్యంగా మార్చుకొని చూడటమే మనం చేయగలిగిన అనుష్ఠానం. దీనినే “విజ్ఞాయ ప్రజ్ఞామ్ కుర్వీత” అని తెలియజేసిందుపనిషత్తు. ఇందులో విజ్ఞానం దాని జ్ఞానాన్ని మనం సంపాదించటమయితే ప్రజ్ఞాన మా సంపాదించిన జ్ఞానధనాన్ని జారిపోకుండా నిలుపుకోవటం. జ్ఞాన సంతానకరణమని దీనికే పేరు పెట్టారు దేశికేంద్రులు. సంతానకరణమంటే పొడిగించటం. తదేక దృష్టితో దైనందిన జీవితాన్ని సాగిస్తూ పోవటమని భావం. అది కూడా ఒక కర్మ అనుకొంటే ఇక మేము చెప్పలేము. అది వాడి కర్మ అని ఊరుకోవటమే మేమివ్వగలిగిన జవాబన్నారు స్వామివారు. ఇంతకూ బ్రహ్మమనేది దాన్ని జ్ఞానానికి వ్యతిరిక్తంగా ఎక్కడో వెదకి చూడవలసిన పదార్ధమని భ్రాంతి పడరాదు. జ్ఞానజ్ఞేయాలు రెండూ అదే కాబట్టి దాని తాలుకు జ్ఞానమే దానిని పొందటం, అనుభవించటం. అనుభవానికి తెచ్చుకొనే ప్రయత్నం జ్ఞానానికదనంగా మరేదీ అక్కర లేదిక్కడ.
Page 105