#


Back

   అందుకే ఉపనిషత్తెప్పుడూ బ్రహ్మస్వరూపాన్ని మాత్రమే వర్ణిస్తూ పోతుంది గాని దానినెలా పొందాలో ఆ మార్గాన్ని వర్ణించి చెప్పదు. అలా చెప్పక పోయేసరికది ఏదో ఉంది రహస్యం. దాని నెలాగైనా అన్వేషించి పట్టుకోవాలని భ్రాంతి పడతారు సాధకులు. అలాంటి అపోహతోనే మంత్రమనీ - తంత్రమనీ- యోగమనీ - ఉపాసన అనీ ఎన్నో అనవసరమయినవన్నీ తెచ్చిపెట్టారు. ఇదంతా కేవలం మన అవివేకం. సత్యమ్-జ్ఞాన-మనంతమ్-శుద్ధమ్- బుద్ధమ్మని సూటిగానూ- నిష్కలమ్ నిష్క్రియమ్-అస్థూల-మనణ్వహ్రస్వమని చాటుగానూ దాన్ని అనేక కోణాల నుంచి బహుముఖంగా వర్ణిస్తూ పోతుంది శాస్త్రం. ఇంతే శాస్త్రం చేసే పని. వస్తువునిలా వర్ణించటం మూలంగా తదాకారమయిన జ్ఞానమొకటి సాధకుడి మనసు కేర్పడుతుంది. అఖండాకారమైన ఆ జ్ఞానమే చాలు. అదే బ్రహ్మానుభవం. ఇక క్రొత్తగా దాన్ని పొందే మార్గం చెప్పవలసిన ఆవశ్యకత ఏముందని అడుగుతారు భగవత్పాదులు.

   ఆయన చెప్పేదేమంటే ఒక గ్రామానికి మనం ప్రయాణం చేయవలసి ఉంటే కేవలమూ ఆ గ్రామాన్ని వర్ణించటంవల్ల ప్రయోజనం లేదు. దానితో పాటు దాన్ని చేరే మార్గం కూడా మనకు తెలుపవలసి ఉంటుంది. గ్రామమే మార్గం కాదు గదా. గ్రామం చేరవలసిన గమ్యమైతే మార్గం దాన్ని చేర్చే సాధనం. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా వర్ణించి తీరాలి. పోతే ప్రస్తుత మీ బ్రహ్మ విషయమలాంటిది గాదు. ఇది ఒక గ్రామంలాగా ఎక్కడో ఉన్నది గాదు. అంతటా ఉన్నది. మనకు భిన్నంగా ఉన్నది కాదు. మన స్వరూపమే జ్ఞేయం కాదు. జ్ఞానమే ఫలానా అని దాని స్వరూపాన్ని గుర్తించగలిగితే చాలు. సాధన మార్గం కూడా అందులోనే గతార్థ Implied మవుతుంది. గతార్ధం కాకపోవటానికి మార్గమనేది దానికి బాహ్యంగా ఒకటి ఉంటే గదా. మార్గమైనా అదే. గమ్యమైనా అదే. కాబట్టి గ్రామాన్ని పొందినట్టు దాన్ని పొందాలని అపోహ పడరాదు. ఒకగ్రామాన్ని ఎక్కడికోపోయి పొందుతాము మనం. అది దేశంలో చేసే ప్రయాణం. అలాగే బాల్యం దాటి యౌవనదశ పొందుతాము. యౌవనం దాటి వార్థక్యమందుకొంటాము. ఇది కాలంలో చేస్తున్న ప్రయాణం. బ్రహ్మ స్వరూపాన్ని పొందటమిలాంటి దేశకాలాల్లో చేయవలసిన ప్రయాణం కాదు. అది ఒక ఆరోగ్యాన్ని పొందటం లాంటి దంటారు ఆచార్యులవారు.

Page 106