ఆరోగ్యమంతకు ముందు కూడా ఉంది మనకు. అది మనకు స్వాభావికం. అయితే మధ్యలో కొన్ని రోగ లక్షణాలు సంక్రమించాయి శరీరంలో. తన్మూలంగా అక్కడే ఉన్నా తాత్కాలికంగా మరుగుపడిందది. మరలా తగిన ఔషధ సేవచేసి వాటిని నిర్మూలించుకోగలిగితే చాలు. మరుగుపడిన ఆరోగ్యదశ మరలా అభివ్యక్తమై Manifest మరలా దాన్ని పొందినట్టు భావిస్తాము మనం.
అలాగే ఈ బ్రహ్మతత్త్వం కూడా మనకు సహజంగా ఉన్న భావమే. సిద్ధమేగాని సాధ్యం కాదని గదా మొదటి నుంచీ మన ప్రతిపాదన. అలాంటప్పుడొక దాన్ని క్రొత్తగా పొందే దేముంది. అయితే దానికీ అనాత్మ భావాలనే అనారోగ్య చిహ్నాలు కొన్ని వచ్చి నెత్తిన పడ్డాయి. ఈ పడటం మూలంగా అది మనకు సహజమైన తత్త్వమైనా ఎంతో దూరమైనట్టు భాసిస్తున్నది. ఇది మనకు దాని సంగతి గుర్తించలేని మరుపేగాని మరేదీ గాదు. అక్కడ మరుగయితే ఇక్కడ మరుపు. శాస్త్ర ప్రమాణ జన్యమైన జ్ఞానంవల్ల ఈ మరుపనే చీకటి పొర విరసిపోతే చాలు. మరలా మన స్వరూపమే అయిన ఆ బ్రహ్మ స్వభావం మనకు దక్కుతుంది. కాబట్టి జ్ఞానమొకటి గడిస్తే చాలు. అదే అనుభవమిక్కడ. జ్ఞానార్జనానంతరం మరలా అనుభవం కోసం ప్రాకులాడనక్కరలేదు. దాని కోసమేవేవో పరికరాలు సమకూర్చుకోవాలనే ప్రయత్న మంతకన్నా అక్కరలేదు. అంటే కర్మోపాసనాది కార్యకలాపం వెంటబడనక్కరలేదని అర్థం. దీపం లాంటిది శాస్త్రమని చెప్పాము. దీపం వెలిగించగానే ఆ వెలుగు చీకటి పొరలు చీల్చివేయటమూ అక్కడ ఉన్న వస్తువాహనాదులను మనం దర్శించటమూ రెండూ ఒకేసారి జరుగుతాయి. పృథక్రయత్న Different Effort మనేది అక్కరలేదు. అలాగే శాస్త్రమనే దీపం కూడా బ్రహ్మజ్ఞానమనే వెలుగును ప్రసాదించిందంటే అది మన అజ్ఞాన తిమిరాన్ని తొలగించటమూ మనకా బ్రహ్మాత్మానుభవాన్ని కలిగించటమూ కూడా ఏకకాలంలో Simultanious జరిగిపోతాయి. ఇక్కడ వేరే యత్నమక్కరలేదంటారు భగవత్పాదులు. కారణమది నూటికి నూరుపాళ్ళూ వస్తుతంత్రమే గాని పురుషతంత్రమే మాత్రమూ గాదు. అంచేత పారమార్థకమైన బ్రహ్మతత్త్వాన్ని మానవుడందుకోవాలంటే తద్విషయమైన జ్ఞాన మొక్కటే ఎప్పటికైనాతగిన సాధనం దానిని మనకు బోధించటమే శాస్త్రానికంతటికీ తాత్పర్యమని సిద్ధాంతీకరించారు శంకర భగవత్పాదులు.
Page 107