#


Back

   ఏతావతా ఈ చర్చకంతటికీ కలిపి మనం నిశ్చయించుకోవలసిన అర్థమేమంటే పరమార్థ సాధనకు కర్మలుగానీ, ఉపాసనలుగానీ అష్టాంగ యోగాదులు గానీ మంత్ర తంత్రాది విద్యలుగానీ ఏవీ మనకు కొఱగావు. ఎందుకంటే ఆ బ్రహ్మమనేది పరినిష్పన్నమైన Accomplished ఒక పదార్థం. అలాంటి పదార్ధాన్ని సాధించాలంటే ఆ సాధనం వస్తుతంత్రమైనదే కావాలి గాని పురుషతంత్రమైన పరికరమేదీ పనికి రాదు. మిగతా కర్మాదికలాపమంతా పురుషతంత్రమైతే జ్ఞానమనేది ఒక్కటే వస్తుతంత్రమైనది. పోతే ఈ జ్ఞానం కూడా దానిపాటికదే ఉత్పన్నమయ్యేది కాదు. ఏదో ఒక ప్రమాణం చేతనే మనకది ఏర్పడవలసి ఉంది. ఆ ప్రమాణాలు మన అనుభవంలో వున్నవి ప్రత్యక్షానుమానాలు రెండే. ఇవి రెండూ మామూలు విషయ జగత్తుకు చెందినవే గాని అవిషయమైన ఆత్మ విషయంలో ఎంత మాత్రమూ పని చేయవు. అందులో పని చేయగలిగింది ఒక్క శాస్త్ర ప్రమాణమే. అది కూడా విధి ముఖంగా కాదు. కేవలం నిషేధముఖంగానే పట్టి ఇస్తుందా తత్త్వాన్ని మనకు. కనుక బ్రహ్మతత్త్వం దానికి విషయమవుతుందనే ప్రమాదం కూడా లేదు. కాగా బ్రహ్మసంబంధి అయిన ఈ జ్ఞానముదయిస్తే చాలు. మనకిక ఉన్నదంతా బ్రహ్మమయంగానే అనుభవానికి వస్తుంది. కాబట్టి శాస్త్రదత్తమైన జ్ఞానానికి భిన్నంగా అనుష్ఠానమనే ప్రసక్తి కూడా లేదక్కడ. ఒకవేళ దాన్ని నిలుపుకొనేందు కభ్యాసమొకటి ఆవశ్యకమైనా అదీ జ్ఞానావృత్తి Continuation రూపమేగాని తద్వ్యతిరిక్తమైన క్రియ కాదు. ఇదీ ఇంతవరకూ మనం చర్చించిన దాని కంతటికీ నిశ్చితార్థం.





Page 108