#


Back

   కొన్నాళ్ళు వాటి వెంటబడి పోయి వాటివల్ల కలిగే కష్టనష్టాలు అనుభవించి ఇంతేనా ఇంతకు మించిన శాశ్వతపదవి ఏదైనా ఉందా అని వచ్చి ప్రాధేయపడిన జిజ్ఞాసువులకు వారి కోరిక కనుగుణంగా జౌపనిషదమయిన జ్ఞానాన్నే బోధిస్తుంది.

   కాబట్టి శాస్త్రం చేసిన పాపమేమీ లేదు. ఒక దీపంలాంటిది శాస్త్రమంటారు. శంకరులు. దీపం మనకు వెలుగును ప్రసాదిస్తుంది. ఆ వెలుగులో మంచి పనీ చేయవచ్చు మనం. చెడ్డ పనీ చేయవచ్చు. ఏదీ చేయక మిన్నకుండవచ్చు. అన్నింటికీ అది సాక్షిగా నిలుస్తుంది. అన్ని పనులకూ ఉపకరిస్తుంది. మనం చేసే మంచి చెడ్డలతో దానికి నిమిత్తం లేదు. అలాగే మానవులలో మంద మధ్యమోత్తమ శ్రేణులెప్పుడూ వుంటారు. వారి మనస్తత్వాలు కూడా అలాగే ఉంటాయి. ఆయా స్వభావాలకు తగినట్టుగానే శాస్త్రం వారికే సహాయపడుతుంది. అది శాస్త్ర అపరాధమెలా అవుతుంది. హితానుశాసనం చేసేది గదా శాస్త్రం. అది మంచినే బోధించాలిగాని చెడ్డను ప్రోత్సహించటం తప్పుగదా అంటే దానికి సమాధానం ముందే చెప్పాము. చెడ్డను చెప్పినట్టు కనిపిస్తున్నా అది దాని వివక్షితం కాదు. క్రమంగా దానిమీద వైముఖ్యం కలిగించి విరక్తుడైన మానవుణ్ని జ్ఞానాని కభిముఖుణ్ని చేయటమే అందులో ఇమిడి ఉన్న స్వారస్యం.

   దీనికి నిదర్శనం శాస్త్రంలో ఉత్తర భాగం పూర్వభాగాన్ని ఖండించటంలోనే మనకు తేటపడుతున్నది. విద్యుపాసనల నెంతగానో ఖండిస్తాయి ఉపనిషత్తులు. రెండూ ఉద్దిష్టమే అయితే ఒకదాన్ని మరొకటి ఆక్షేపించటం దేనికి. మొదటిది చెప్పిన ధర్మం సాపేక్షమే గనుక రెండవదైన జ్ఞానం దగ్గరికి వచ్చే సరికది దీనికి పూర్వపక్షమయి పోయింది. ఆ జ్ఞానం నిరపేక్షమయినది గనుక అదే నిరాక్షేపమయిన సిద్ధాంతంగా నిలిచిపోతున్నది. అందుకే ఆక్షేప సిద్ధాంతాలను పూర్వోత్తర పక్షాలుగా శాస్త్రంలో వ్యవహరించటం. ఇందులో కర్మమీమాంస అంతా పూర్వపక్షమయితే బ్రహ్మ మీమాంస ఒక్కటీ ఉత్తర పక్షమూ లేదా సిద్ధాంతమయింది. ఇదే అసలైన వేదతాత్పర్యం కాబట్టి వేదాంతమని దానికే పేరు వచ్చింది. అంటే వేదపూర్వభాగ ప్రతిపాదితమయిన విధ్యుపాసనలు రెండూ దానిలోనే పర్యవసానం చెందితే ఒక్క జ్ఞానమే చివరకు శాస్త్రానికంతటికీ ప్రతిపాద్యమయిన విషయమని తేల్చిపారేశారు శంకర భగవత్పాదులు.

Page 98