#


Back

   అలాంటప్పుడిక శాస్త్రం ధర్మాన్నీ బ్రహ్మాన్నీ రెండు పరస్పర విరుద్ధమైన భావాలను బోధిస్తున్నదనే ప్రశ్నేలేదు. అసలు దాని ఏకైక లక్ష్యం బ్రహ్మజ్ఞానాన్ని ఈ జీవకోటికి ప్రసాదించి గట్టున పడవేయటమే. తదతిరిక్తంగా ఇక ఏది చెప్పినా మనలను మరలా అమాంతంగా ఈ సంసార సాగరంలో పడద్రోయటమే అవుతుంది. అయినా జ్ఞానకాండకు భిన్నంగా పూర్వభాగమైన కర్మకాండను వర్ణించిందంటే అది ఆ పాత రమణీయమే గాని నిజంలో శాస్త్రవివక్షతం కాదని ఘంటాపథంగా చాటుతారు శంకరులు. పూర్వభాగ ముత్తరభాగమైన జ్ఞానానికి కేవలం మార్గదర్శకమే. దాని కోసమే దీని ప్రస్తావన. దీని నాలంబనం చేసుకొని ఆ బలంతో జ్ఞాన ప్రాసాదాన్ని అధిరోహించమని శాస్త్రం మనకు చేసే హితోపదేశం. అంతకన్నా వేరు ప్రయోజనం లేదు దీనికన్నారు భగవత్పాదులు. ఇంకా కొంత దూరంపోయి ఒక గొప్ప రహస్యాన్ని కూడా బయట పెట్టారాయన. అసలీ కర్మలూ - ఉపాసనలూ చేయమని బోధించటం అవి స్వయం సంపూర్ణమని భావించి అక్కడికే నిలిచి పొమ్మనిగాదు. వాటి మంచి చెడ్డల ననుభవించటంవల్ల మనకు తీవ్రమైన వైరాగ్య భావమేర్పడి ఎప్పటికైనా వాటి నుంచి వైదొలగటానికీ - నిశ్రేయస ప్రదమైన బ్రహ్మజ్ఞానాని కున్ముఖులమై ప్రవర్తించటానికీ - అని వ్యాఖ్యానించారాయన.

   న్యాయమైతే శాస్త్రమిలా డొంక తిరుగుడుగా బోధించి ఉండగూడదు. కాని ఇది దాని అపరాధం కాదు. లోకుల అపరాధం. లోకంలో కర్మ జడులు కొందరున్నారు. ఏదో ఒక కర్మచేస్తూ తద్వారానే చివరకు మోక్షాన్ని కూడా అందుకోవాలని చూస్తారు వారు. అంతకు తప్ప సకల కర్మ నివృత్తి రూపమైన జ్ఞానమార్గం వారికంతు పట్టదు. మరి కొందరైతే ఆ బ్రహ్మాన్ని కూడా ఏదో ఒక ఆకారంలో ధ్యానించి దాని అనుగ్రహంతో ఐహికా ముష్మిక సుఖాలూ వాటికీ అతీతమైన మోక్షసుఖమూ కూడా బావుకోవాలని ఆశపడతారు. ఇది మానవుల స్వభావంలోనే కరుడుగట్టి ఉన్నట్టి బలహీనత. ఎంత కాదని శాస్త్రం మొరపెట్టినా వదలిపెట్టే వ్యవహారం కాదు. అందుకని శాస్త్రం సర్వులనూ ఏదో ఒక మార్గంలో ఉద్దరించటానికి బద్ధకంకణ మయినది కాబట్టి మొట్టమొదట అసత్యమయినా అనిత్య సుఖదాయకమయినా కర్మలనూ ఉపాసనలనూ వారి కోరికలకు తగినట్టు ఏ కరువు పెడుతుంది.

Page97