తన్మూలంగా ప్రత్యవాయాది దోషాలు తొలగిపోయి సాధకుడి చిత్తం శుద్ధమయితే క్షేత్రమనేది తయారయిందని అర్థం. పోతే ఇక ఉపాసనలనే రెండవ జాతి కర్మలున్నాయి. అవి కూడా సకామంగా కాక నిష్కామంగా చేయమని సలహా ఇచ్చారు. ఉపాసించే దేవతను కూడా ఆ పరమేశ్వరుని ఒకానొక విభూతే నని భావించమన్నారు. దానితో చిత్తానికి శుద్ధియే గాక ఒక విధమైన ఏకాగ్రత కూడా సిద్ధిస్తుంది. ఇందులో ఉన్న మర్మమేమంటే శుద్ధివల్ల ఆవరణ రూపమైన తమోమాలిన్యం క్షాలితమైతే ఏకాగ్రతవల్ల విక్షేపరూపమైన రజఃకాలుష్యాన్ని కడిగివేసి నట్టవుతుంది. రజస్తమో దోషాలు రెండూ నశిస్తే సత్వం విశుద్ధమై చిత్తక్షేత్రంలో జ్ఞానబీజాలు వాటిపాటికవే అంకురిస్తాయి. ఆజ్ఞానమిక మోక్షఫలాన్ని మనకు సాక్షాత్తుగానే ప్రసాదిస్తుంది.
ఈ ప్రకారంగా శాస్త్రంలో పూర్వభాగమైన కర్మకాండకూడా మోక్షానికే సాధన మవుతున్నది. జ్ఞానం సాక్షాత్తుగానైతే అది జ్ఞానం ద్వారా పరంపరగా సాధనమవుతుంది. ఏతావతా రెండూ కలిసి చివరకు ఒకే ప్రయోజనాన్ని సాధిస్తున్నాయి గనుక రెంటికీ ఏకవాక్యత సిద్ధిస్తున్నదంటారు ఆచార్యులవారు. "కామ్యవర్జితమ్ నిత్యమ్ కర్మజాతమ్ సర్వమ్ ఆత్మ జ్ఞానోత్పత్తి ద్వారేణ మోక్ష సాధనత్వమ్ ప్రతి పద్యతే- ఏవమ్ కర్మకాండే నాస్య ఏక వాక్యతావగతిః" అని వారి వాక్యం. కర్మకాండ అన్నారు గాని ఉపాసన అనలేదు గదా అని శంకించవచ్చు. ఇలాంటి శంక మనకు కలుగుతుందేమోనని ఆయనే శంకించి "కర్మ- అపర బ్రహ్మ విద్యాంచ" అని విద్యను కూడా జోడించారు. విద్య అంటే ఉపాసన అని అర్థమిక్కడ. ఎందుకంటే అపరబ్రహ్మ విషయం గనుక. దానికే దిక్కులేనప్పుడిక మిగతా దేవతో పాసనల మాట తడవనే అక్కరలేదు.
ఇంతకూ ఈ దృష్టితో చూస్తే మొత్తం వేదానికంతటికీ కూడా తాత్పర్యం మోక్షమేనని ఆ మోక్షఫలానికి సాధనంగ ఒక్క జ్ఞానాన్నే అది దానిమీద దీనిమీద నెపం పెట్టి బోధిస్తున్నదని మనకు బోధ పడుతుంది. ఈ మాట కూడా ముక్త కంఠంతో స్వామివారు లోకానికి చాటుతున్నారు. “ఏవ మేతస్మిన్ ఆత్మ విషయే సర్వోవేదో యథా ఉపయుక్తో భవతి త త్తథా వక్తవ్య మితి కండికా" అని ఖండింతంగా వేద హృదయాన్ని బయట పెట్టారాయన.
Page 96