#


Back

   మరి ఇలాంటి అనర్థదాయకమైన ధర్మాన్ని ఇంత సవిస్తరంగా ఎందుకు బోధిస్తున్నది శాస్త్రం. బోధిస్తే అన్ని విధాలా వాంఛనీయమైన మోక్ష పురుషార్ధాన్ని మాత్రమే బోధించి ఊరుకోవాలి. అంతేగాని ఒకవైపు సర్వోత్తమమైన తత్త్వాన్ని వర్ణిస్తూ మరొకవైపు తద్విరుద్ధమైన ఆతత్త్వాన్ని మనకందివ్వటమేమిటి. ఇలా రెండు నాలికలతో మాటాడితే దానిపైన మనకు ప్రామాణ్యబుద్ధి ఎలా ఏర్పడుతుంది. ఏర్పడకపోతే అలాంటి శాస్త్రాన్ని నమ్మి ముందుకు ప్రయాణం చేయట మంధగోలాంగూల న్యాయమే అవుతుంది గదా - అని ప్రశ్న.

   దీనికి శంకర భగవత్పాదులు చేసి చూపిన సమన్వయమంతా ఇంతా గాదు. బ్రహ్మాండమైన సమన్వయ Compromise మది. పైకి చూస్తే శాస్త్రంలోని పూర్వోత్తర భాగాలకెంతో వైరుద్ధ్యమున్నట్టు కనిపిస్తుంది. ద్వైత జగత్తులోనే పడదోసి మన ప్రాణం తీసేది ఒకటైతే - దాని కతీతమైన అద్వైత సత్యానుభవాన్ని అందజేసేది మరొకటి. చూడబోతే ఈ కర్మకాండకూ ఆ జ్ఞానకాండకూ ఏ మాత్రమూ లంగరందటంలేదు. కానీ లోతుకు దిగి చూస్తే ఇందులో ఒక గొప్ప సమన్వయ సూత్రం దాగి ఉందంటారాయన. కర్మోపాసనలు రెండూ మనం వాటి వాటికి నిర్దిష్టమైన స్వర్గాది ఫలాలకే గాదు. కావలసి వస్తే వాటిని మనం మోక్షఫలప్రాప్తికే ఉపయోగపడేలా చేసుకోవచ్చు. ఒక మహానది అనవసరంగా పోయి లవణ సాగరంలో కలుస్తుంటే దాని కానకట్టలు కట్టి ఆ నదీ జలాన్ని మనం పంట భూములవైపు మళ్ళిస్తాము. అలాగే ఈ కర్మాదులను కూడా కేవలం ధర్మపురుషార్థం వైపే పయనించకుండా బ్రహ్మతత్త్వం వైపు త్రిప్పుకోవచ్చు. ఎట్లాగంటే కర్మలనేవి అసలు నాలుగు విధాలు. నిత్యమూ - నైమిత్తికమూ - కామ్యమూ- నిషిద్ధమూ. వీటిలో నిషిద్దాన్ని ఎలాగూ వర్జిస్తాము. పోతే కామ్యాన్ని కూడా వర్ణించాలన్నారు వేదాంతులు. కామ్యమంటే స్వర్గ సుఖదాయులైన జ్యోతిష్టోమాదులు. వీటి రెంటినీ పరిహరిస్తే మనకిక స్వర్గ నరకాల చింతేలేదు. పోతే మిగిలిన సరకు నిత్యనైమిత్తికాలు రెండు. జపహోమాదులు నిత్యకర్మలైతే ఆయా నిమిత్తమున్నప్పుడాచరించే గ్రహణ సంక్రమణాదులు నైమిత్తికాలు. ఇవి రెండూ మాత్ర మనుష్ఠిస్తూ పొమ్మన్నారు. అయితే మామూలుగా కాక ఈశ్వరార్పణ బుద్ధితో నిరహంకారంగా ఫల నిరపేక్షంగా అనుష్ఠించాలనేది షరతు.

Page 95