#


Back

   అదేమంటే శాస్త్రం జ్ఞానమే గాక కర్మోపాసనలను కూడా ప్రతిపాదిస్తున్నదనేది వాస్తవమే. దాని నెవరూ కాదనటం లేదు. అయితే ఆ ప్రతిపాదించటం వాటిని మోక్షసాధనాలుగా ఉద్దేశించి కాదు. మోక్షసాధనమొక్క జ్ఞానమే. దాన్ని ప్రత్యేకంగా ఉపనిషత్తులలో బోధించింది శాస్త్రం. పోతే ఇక విధ్యుపాసనాకాండలలో బోధించిన విషయమంతా మోక్షపురుషార్ధం కోసమని గాదు. ధర్మమనే పురుషార్ధం కోసం. ధర్మమంటే ఏమిటి. శాస్త్రవిహితమైన కర్మానుష్ఠానం. దానికి ఫలం చివరకు స్వర్గమైనా కావచ్చు. లేక ఆయాదేవతల లోకాలైనా కావచ్చు. కేవల కర్మిష్ఠులకైతే స్వర్గమే ఫలం. మరి ఉపాసకులకైతే ఏయే దేవత నుద్దేశించి ఉపాసిస్తే ఆయా దేవతా సాయుజ్యం ఫలం. ఈ ఉపాసనలు కూడా ఒకటి రెండు గాదు. మూడు తరగతులున్నాయి. కర్మాంగోపాసనా-దేవతోపాసనా సగుణ బ్రహ్మోపాసనా. ఇందులో మొదటి దానికి ఫలం దురితక్షయం రెండవదాని కైశ్వర్యప్రాప్తి మూడవ దానికి క్రమముక్తి. ఇవి మూడూ ఆయా ఉపాసనలకు ప్రత్యేకమైన ఫలాలు. కాగా ఈ కలాపమంతా ధర్మం క్రిందికే వస్తుంది గాని మోక్షానికిందులో ఏదీ పనికిరాదు. అటు నిత్యనైమిత్తికాది కర్మలూ పనికి రావు ఇటు త్రివిధమైన ఉపాసనలూ పనికి రావు. పితృలోకం నుంచి సత్యలోకం వరకే ఈ రెండింటికీ అవధి. అది దాటిపైకి తీసుకుపోయే స్తోమత వీటి రెంటికీ లేదు. ఆయా లోకాంతర భోగానుభవమిచ్చిన తరువాత అంతగా అయితే మంచి జన్మలను మనకు ప్రసాదిస్తాయి. ఆలోచిస్తే రెండూ బంగారు సంకెళ్లే మన పాలిటికి. ఎందుకని. లోకాంతరాలూ, జన్మాంతరాలు, ఎడతెగకుండా ఏర్పడుతూనే ఉంటాయి కాబట్టి ఈ సంసార బంధం మనకెప్పటికీ తప్పటం లేదు. ఇక వీటివల్ల ముక్తి పొందటమేమిటి మన ముఖం.

   అయితే ఇప్పుడు మరలా ఒక ఆక్షేపణ వస్తుంది. అదేమిటంటే శాస్త్రమనేది అత్యంత ప్రామాణికమని మొదటినుంచీ ప్రతిపాదిస్తూ వచ్చారు. అలాంటప్పుడది మానవులకు ఆత్యంతికమైన హితాన్నే బోధించాలి గాని అహితాన్ని ఉపదేశించరాదు. ఉపదేశిస్తే దాని ప్రామాణికత్వమే దెబ్బ తింటుంది. ప్రస్తుతం ధర్మమనేది ఎలాంటిదైనా అది మానవుడికి మోక్షాన్ని ప్రసాదించలేదు సరికదా మీదు మిక్కిలి అతడి నీ సంసార జంబాలంలోనే పడదోస్తుందని వాక్రుచ్చారు. అది మనపాలిటికెంతో అవాంఛనీయమైన పరిస్థితి గదా.

Page 94