#


Back

   మేము జ్ఞానాన్ని సాధకంగా చెప్పటం లేదు- బాధకంగా మాత్రమే నంటారాయన. జ్ఞానం బ్రహ్మాన్ని సాధిస్తున్నదంటే తప్పు. అలా ఎప్పటికీ సాధించబోదది. అయితే మరేమి చేస్తుంది. బ్రహ్మా భిన్నమైన జగత్తును బాధిస్తుంది. అంత మాత్రమే. జగత్తనే ఉపాధి ఒక చీకటిలాగా ఆవరించటంవల్లనే బ్రహ్మమనేది మనకు కనపడకుండా మరుగుపడిపోయింది. చీకటిలాగానే ఈ ఉపాధి అసలెక్కడాలేదు. అది మన అజ్ఞాన కల్పితమే. ఇప్పుడీ అజ్ఞానమనే ఆవరణాన్ని ప్రక్కకు తొలగిస్తే చాలు. గాఢాంధకారం తొలగితే వస్తువు కంటబడినట్టు అజ్ఞానం తొలగితే బ్రహ్మతత్త్వం దానిపాటికదే భాసిస్తుంది. అజ్ఞానమెలా తొలగుతుంది. దానికి బాధకం జ్ఞానమే. జ్ఞానం చేత అజ్ఞానమనేది బాధిత Annihilated మైతే-చివరకేది అబాధకంగా Uncontradicted నిలిచి ఉంటుందో అది ఇక బ్రహ్మమేనని సాధకుడికి చెప్పకుండానే తెలిసిపోతుంది. ఇక దాన్ని క్రొత్తగా సాధించవలసిన పని ఏముంది. సాధించకుండానే దాన్ని సాధించి నట్టయింది. దానికి భిన్నమైన ఉపాధి ప్రపంచాన్ని బాధించటమే దాన్ని మనం సాధించటం ఇలా అనులోమంగా Positive కాక ప్రతిలోమంగా Negative పని చేస్తుంది జ్ఞానమనే సాధనం. అందుకే జ్ఞానాన్ని సాధనమని నిర్దేశించినా మనకు బాధలేదు. మరి ఇలాంటి ప్రతిలోమ మార్గంలోకూడా ఉపయోగపడే యోగ్యత తద్వ్యతిరిక్తమైన కర్మోపాసనలకు రెండింటికీ లేదు. గనుకనే అవి రెండూ అసలే సాధనాలు కాకుండా పోయాయి.

   అయితే ఒక ఆశంక. అసలే అవి సాధనాలు కాకపోతే శాస్త్రం వాటినెందుకు ప్రతిపాదించినట్టు. మీ జ్ఞానాన్నికూడా శాస్త్రమే గదా ప్రతిపాదించిందని చెబుతున్నారు. అది జ్ఞానాన్ని ఎలా ప్రతిపాదించిందో కర్మనూ ఉపాసననూ కూడా అలాగే ప్రతిపాదిస్తుంది గదా. రెండింటినీ శాస్త్రమే ప్రతిపాదించినప్పుడు రెండూ మనకు ప్రామాణికమే కావాలి గాని అందులో ఒకటి మాత్రమే మన కుపాదేయం కావట మేమిటి. మిగతా రెండూ కాకపోవటమేమిటి. ఇది ఏమి న్యాయమని ఆక్షేపించవచ్చు. ఈ ఆక్షేపణనెంతో ముందుగానే పసికట్టారు భగవత్పాదులు. పసికట్టి దానికెంతో అద్భుతమైన సమాధానాన్ని వారు సెలవిచ్చారు.

Page 93