తన జీవభావానికీ కూడా అజ్ఞానమే మూలకారణం. అదినిర్మూలమైన నాడు సహజమైన తన బ్రహ్మభావాన్ని మరలా తాను అందుకోగలడు. అంచేత మోక్షాన్ని సాధించాలంటే ఇంతకూ అజ్ఞాన నిర్మూలనం కావాలి. అది నిర్మూలం కావాలంటే ఏది సాధనం. దానికేది శత్రువో అది. ఏది దానికి శత్రువు. అజ్ఞానానికి శత్రువేమిటని ప్రశ్నేముంది. జ్ఞానమే దానికి శత్రువు. జ్ఞానం లేకపోవటంవల్లనే గదా అజ్ఞానం రాజ్యమేలుతున్నది. జ్ఞానోదయమయిందంటే చాలు. సూర్యోదయమైతే అంధకారంలాగా ఎక్కడి దక్కడ పటాపంచలయి పోతుంది. అప్పుడు చిరకాంక్షితమైన మోక్షఫలం తనపాటికి తాను వచ్చి మన ఒళ్ళో పడుతుంది. కాబట్టి జీవుడి దృష్టితో చూచినా జ్ఞానమే మోక్షసాధనమని తేటపడుతున్నది.
అయితే ఇప్పుడొక పెద్ద ఆక్షేపణ వస్తుంది. అదేమంటే జ్ఞానమే సాధన మంటున్నారు మీరు. ఇది మాత్రం సాధనమెలా అయింది. జ్ఞానమంటే తెలుసుకోవటం గదా. తెలుసు కోటమనేసరికదీ ఒక క్రియే. శారీరకం కాకపోయినా మానసికమైన క్రియ. మానసికమైన ఉపాసన నింతకుముందు తప్పుపట్టారు మీరు. అలాంటప్పుడిది మాత్రం ఎలా ఒప్పుదల అవుతుంది. పైగా తెలుసుకోవలసిందేమిటి మనమిక్కడ. బ్రహ్మస్వరూపమే గదా. బ్రహ్మాన్ని తెలుసుకోవలసి వచ్చిందంటే అది ఏమవుతుంది. మనజ్ఞానానికి విషయమవుతుంది. విషయమెప్పుడయిందో అప్పుడది జ్ఞేయమే గాని ఇక జ్ఞానం కావటానికి వీలులేదు. వీలు కాకుంటే అది బ్రహ్మ స్వభావానికే విరుద్ధం. ఎందుకంటే బ్రహ్మమనేది కేవలం జ్ఞానస్వరూపమేనని ప్రకటించి కూచున్నాము. అలాంటి దాన్ని మరలా జ్ఞేయమని చాటితే అది ఏమి సబబు అని ఆక్షేపణ.
దీన్ని పరిష్కరించటంలో వుంది శంకరుని ప్రతిభ అంతా. ఆయన దీనికొక్కటే సమాధానం చెప్పారు. బ్రహ్మతత్త్వాన్ని సాధించటానికి వాస్తవంలో ఏ సాధనమూ పనికి రాదు. అది కర్మే గాదు. ఉపాసనే గాదు. ఆ మాటకు వస్తే జ్ఞానం కూడా పనికి రాదు. ఎంచేతనంటే సిద్ధమైన పదార్ధమది. ఇక దాన్ని మరలా సాధించట మేమిటి. అది స్వవచో వ్యాఘాత Self contradiction మనిపించుకొంటుంది. అయితే కర్మోపాసనలను కాదని చెప్పి జ్ఞానానికెలా పట్టాభిషేకం చేశారని అడగవచ్చు.
Page 92