#


Back

   పోతే ప్రస్తుత మీ బ్రహ్మమనేది కూడా ఒక సిద్ధమైన పదార్ధమే. దానికి కూడా మనమింతకు ముందు పేర్కొన్న జలాది పదార్ధాలలాగా ఒక విశిష్టమైన స్వభావమున్నది. శుద్ధమ్-బుద్ధమ్-ముక్తమ్-సర్వగతమ్ - సర్వాత్మకమ్ అని అనేక విధాల వర్ణించింది దాన్ని శాస్త్రం. ఇదే ఇక్కడ కన్నులాగా మనకు ప్రమాణం. ఈ ప్రమాణ వాక్యాన్ని శ్రవణం చేశామంటే శ్రవణేంద్రియం ద్వారా మన మనసులో ఆ బ్రహ్మమనే ప్రమేయం తాలూకు వృత్తి ఒకటి ఆవిర్భవిస్తుంది. దీనికి బ్రహ్మాకార వృత్తి అని పేరు. ఇదే బ్రహ్మజ్ఞానం. ఇప్పుడీ కలిగిన జ్ఞాన మాబ్రహ్మమనే వస్తువుకు సంబంధించిందే కాబట్టి మిగతా బల్లలు, కుర్చీల జ్ఞానం మాదిరే వస్తుతంత్రం. బ్రహ్మమనే వస్తువెలా ఉందో అలాగే ఉంటుందిది. కనుకనే బ్రహ్మతత్త్వాన్ని పట్టుకోటానికి ఈ జ్ఞానమనేదొక్కటే సాధనమవుతున్నది. దీనికి భిన్నంగా మానవుడు తన బుద్ధిబలంతో ఎంత హేతువాదం చేసినా అది ఎన్నటికీ సాధనం కానేరదు. కారణం అది పురుషబుద్ధి జన్యమే గాని వస్తుజన్యమైన జ్ఞానం కాదు.

   జ్ఞానమే సాధనమని చెప్పటంలో మరి ఒక సబబు కూడా కనిపిస్తున్నది. అదేమిటంటే సాధనమనేది చాలావరకు దాని సాధ్యాన్ని బట్టి వర్తిస్తుంది. సాధ్యమొక తీరుగా ఉంటే సాధనం మరొక తీరుగా ఉండనేరదు. ఒకదానికొకటి సజాతీయమై ఉండటమే స్వాభావికం. మన అనుభవంలో కూడా చూడండి. ముల్లు తీయటానికి ముల్లే కావాలంటారు. వజ్రాన్ని భేదించేది వజ్రమే నంటారు. అయస్సు నాకర్షించేది అయస్కాంతమేనని తెలుసు మనకు. సజాతీయమే ఎప్పుడైనా సజాతీయానికి సాధనం. ఈ న్యాయాన్ని Law బట్టి చూస్తే జ్ఞానమే బ్రహ్మానికి సాధనం. వేరొకటి గాదు. ఎందుకంటే బ్రహ్మమని నీవేది పేర్కొంటున్నావో అది జ్ఞాన స్వరూపమే. "ప్రజ్ఞానమ్ బ్రహ్మ” అఖండమైన జ్ఞానమే గదా బ్రహ్మమని ఘోషిస్తున్న దుపనిషత్తు. అంచేత సాధ్యమైన బ్రహ్మమెప్పుడు జ్ఞానమయిందో దానిని సాధించే ఉపకరణం Instru-ment కూడా తత్సజాతీయ Similar మైన జ్ఞానమే కావటంలో ఆశ్చర్యం లేదు.

   అంతేకాదు. ఇది బ్రహ్మస్వభావాన్ని బట్టి చెప్పిన మాట. పోతే జీవుడి స్వభావాన్ని బట్టి చూచినా జ్ఞానమే కావాలి సాధనం. మరొకటి కావటానికి లేదు. ఏమి కారణం. జీవుడనేవాడు అనాది సిద్ధమైన అజ్ఞానం నిమిత్తంగా ఏర్పడ్డాడు. అందువల్లనే తన స్వరూపమే అయిన బ్రహ్మతత్త్వాన్ని మరచి దానినే ప్రపంచ రూపంగా దర్శిస్తున్నాడు.

Page 91