#


Back

   మరి జ్ఞానమనే దాని విషయమలా కాదు. ఇందులో వికల్పమనే మాటకే ఆస్కారం లేదు. కాబట్టి పురుషతంత్రం కాదిది వస్తుతంత్రం. వస్తుస్వభావాన్ని బట్టి వర్తించేదేదో అది వస్తు తంత్రం. పురుషుడి ఇష్టానిష్టాలతో నిమిత్తం లేదిక్కడ. పురుషుడు గ్రహించినట్టు వస్తువుండటం కాకుండా వస్తువున్నట్టుగా పురుషుడు గ్రహించాలి. మరి వస్తువనే దెప్పుడూ ఒకే ఒక రూపంలో ఉంటుంది. అది మారేది గాదు. కాబట్టి దాని ననుసరించి ఏర్పడే జ్ఞానం కూడా మారదు. ఇలాంటి జ్ఞానాన్ని పట్టుకొని పోయామంటే సరాసరి మనల నా వస్తువు దగ్గరికే తీసుకెళ్ళుతుంది. సందేహం లేదు.

   ఇంతెందుకు ఒక జలమనే పదార్థమే ఉందనుకోండి. చల్లగా తెల్లగా ద్రవంగా ఉండి పల్లానికి ప్రవహిస్తూ ఉండటం దాని స్వభావం. ఆ స్వభావాన్ని బట్టే మనకు దాని జ్ఞానమేర్పడిందనుకోండి. తప్పకుండా అది ఆ జల స్వరూపాన్ని మన మనోనేత్రానికి చూపగలదు. కారణమేమంటే జ్ఞానమనేది ప్రమాణ జన్యం యథా భూత విషయమని వర్ణించారు జగద్గురువులు. విషయమంటే మనకు గోచరించే పదార్ధం. దీనికే ప్రమేయమని కూడా పేరు. అది ఎలా ఉందో అలాగే దాని రూపరేఖలను మనకు పట్టి ఇచ్చేది ప్రమాణం. ఈ రెండు షరతులూ ఉన్నప్పుడిక జ్ఞానమనేది కలగటంలో ఎలాటి ప్రతిబంధకమూ లేదు. ఉదాహరణకు మనమున్న గదిలో ఒకబల్లగాని కుర్చీగాని ఉన్నదనుకోండి. అది మనం తెలుసుకోవలసిన పదార్ధం. తెలుసుకోవాలంటే ఆ చెప్పిన పదార్థమక్కడ ఉండి తీరాలి. అలాగే దానిని గ్రహించే నయనేంద్రియం కూడా మనకుండి తీరాలి.

   ఈ ప్రమేయ ప్రమాణాలు రెండూ సక్రమంగా పని చేస్తున్నప్పుడా వస్తువు తాలూకు జ్ఞానమిక మనకు కలగకపోవట మనేది అసంభవం. పైగా ఆ వస్తువొక విధంగా ఉంటే మరొక విధంగా కలగ దాజ్ఞానం. అదిఎలా ఉందో అలాగే కలుగుతుంది. చక్షురింద్రియం గ్రహించిన ఆ రూపం తద్ద్వారా మనసు కెక్కి మనో యవనిక మీద తదాకారా కారితమైన ఒక ముద్ర Impression of the same form పడుతుంది. ఈ మనోవృత్తికే జ్ఞానమనీ వృత్తి అనీ వృత్తి జ్ఞానమనీ శాస్త్రకారుల వ్యవహారం. ఇది బహ్యమైన వస్తువు ముఖం నుంచి ఊడిపడ్డట్టు తదాకారంగానే ఉదయిస్తుంది. కాబట్టి పురుష తంత్ర మేమాత్రమూ కాదది. నూటికి నూరు పాళ్ళూ వస్తుతంత్రమే.

Page 90